ఏపీకి సహకరించేందుకే వీక్‌‌‌‌‌‌‌‌ రిట్‌‌‌‌‌‌‌‌..పోలవరం–నల్లమలసాగర్ విషయంలో ప్రభుత్వ ద్రోహం బయటపడ్డది:హరీశ్ రావు

ఏపీకి సహకరించేందుకే వీక్‌‌‌‌‌‌‌‌ రిట్‌‌‌‌‌‌‌‌..పోలవరం–నల్లమలసాగర్ విషయంలో ప్రభుత్వ ద్రోహం బయటపడ్డది:హరీశ్ రావు
  •     పోలవరం–నల్లమలసాగర్ విషయంలో ప్రభుత్వ ద్రోహం బయటపడ్డది: హరీశ్‌‌‌‌రావు
  •     విచారణార్హత లేని పిటిషన్​ వేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు..
  •     సూట్​ వేయడమంటే ఏపీ ప్రాజెక్ట్​కు ఓకే చెప్పడమేనని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న పోలవరం– నల్లమలసాగర్​ లింక్​ ప్రాజెక్ట్‌ను ఆపాలంటూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం విచారణార్హత లేని పిటిషన్‌ వేసిందని, ఈ విధంగా ఏపీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సుప్రీంకోర్టు సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి నిజస్వరూపం, ద్రోహం బయటపడిందని అన్నారు. సుప్రీంకోర్టులో రిట్​ పిటిషన్‌ను ప్రభుత్వం వెనక్కు తీసుకున్న అంశంపై సోమవారం హరీశ్‌ స్పందించారు. నాడు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుపై స్టే సాధిస్తే.. ఇక్కడి కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. ప్రభుత్వ తరఫు లాయర్​, కాంగ్రెస్​ ఎంపీ అయిన అభిషేక్​ మనుసింఘ్వీకి ఈ మాత్రమైనా తెలియదా? అని ప్రశ్నించారు. దీనికోసమే ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్​ సూటు, బూటు వేసుకొని ఢిల్లీదాకా వెళ్లారా? అని అన్నారు. నీటి హక్కులన్నింటినీ ఏపీకి ధారాదత్తం చేస్తూ.. రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి చరిత్రాత్మక ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. రిట్ వెనక్కు తీసుకొని సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ చెప్పడమంటే.. పోలవరం –నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమేనన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్నాటక వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగియని కథేనన్నారు. ఈలోగా ఏపీ ప్రాజెక్టు పూర్తి చేసి, తెలంగాణ  హక్కులను కాలరాస్తూ నీళ్లను తరలించుకుపోతుందని అన్నారు.   

చంద్రబాబుకు ఈ వీక్‌ పిటిషన్ గిఫ్ట్‌

ఈ బలహీనమైన రిట్​ పిటిషన్..​ సంక్రాంతి పండుగ కానుకగా చంద్రబాబుకు రేవంత్​ ఇచ్చిన గిఫ్ట్ అని హరీశ్‌రావు అన్నారు.  పోలవరం– నల్లమలసాగర్​ ప్రాజెక్ట్​ విషయంలో ఏపీకి రేవంత్​ ప్రభుత్వం సహకరిస్తున్నదని ఆరోపించారు. ‘‘పోనుపోను అనుకుంటూనే రేవంత్‌రెడ్డి ఆనాడు ఢిల్లీ మీటింగ్‌కు పోయిండు. అజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ చేసిండు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాసిండు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీంకోర్టుకు వెళ్లి నల్లమలసాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపిండు. పసలేని రిట్ పిటిషన్​ వేసి పరిపూర్ణంగా నల్లమలసాగర్‌‌కు మద్దతు ప్రకటించిండు’’ అని వ్యాఖ్యానించారు. తాము నిలదీస్తేనే బనకచర్లను అడ్డుకుంటామని, సుప్రీంకోర్టుకు వెళ్తామని నమ్మబలికి.. ఇప్పుడు కావాలనే బలహీనమైన రిట్​ పిటిషన్​ను దాఖలు చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.  రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం అడ్డుకోని ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్​ని తెలంగాణ సమాజం క్షమించబోదని అన్నారు.