మా ఏడేండ్ల పాలనకు  రెఫరెండం

మా ఏడేండ్ల పాలనకు  రెఫరెండం

హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికను కేంద్రంలో ఏడేళ్ల బీజేపీ పాలనకు, రాష్ట్రంలో ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనకు రెఫరెండంగా తీసుకుందామని మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ ఆఫీసులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆ పార్టీ గోబెల్స్ ప్రచారాన్ని బాగా ఒంటబట్టించుకున్నారని ఎద్దేవా చేశారు. గ్యాస్ ధరల పెంపును సమర్థిస్తున్నారో లేదో చెప్పి ఓట్లడగాలని ఈటలను డిమాండ్ చేశారు. గ్యాస్ ధరపై ఈటల చెప్పిన అబద్దాలపై తాను విసిరిన రాజీనామా సవాలుకు రెండు రోజులైనా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తన మీటింగులకు కరెంటు కట్ చేస్తున్నారని, వేధిస్తున్నారని చెప్పుకుని జనం సానుభూతి పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘కేసీఆర్ కు గోరీ కడ్త, టీఆర్ఎస్ కు అగ్గి పెడ్తనని ఈటల ఫస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఇదేనా విలువలతో కూడిన రాజకీయం? మేం మందు, మాంసం పంచినమని, రూ.20 వేలు ఇస్తున్నమని అబద్ధాలు చెప్తున్నరు.” అని అన్నారు. బీజేపీ పాలనలో ఏడేళ్లలో గ్యాస్ ధర రెండింతలైందని హరీశ్ దుయ్యబట్టారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్, యూపీ, కర్ణాటక, ఏపీల్లో కరెంటు కోతలున్నా తెలంగాణలో లేవన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాల బాపతు వడ్డీ కోసం ఐదు మండలాల్లో రూ.25.89 కోట్లు బతుకమ్మ పండుగ ముందు వాళ్ల ఖాతాల్లో జమ చేశామన్నారు. ‘నేనోడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా. నేను గెలిస్తే కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఉంటడా?’ అన్న ఈటల సవాలుపై స్పందన కోరగా హరీశ్ బదులివ్వకుండా వెళ్లిపోయారు.