గెల్లు శ్రీనివాస్ గెలిస్తేనే హుజురాబాద్ అభివృద్ధి

గెల్లు శ్రీనివాస్ గెలిస్తేనే హుజురాబాద్ అభివృద్ధి

హుజూరాబాద్: గెల్లు శ్రీనివాస్ గెలిస్తేనే హుజురాబాద్ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు మంత్రి హరీష్ రావు. బుధవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ.. ఈటలను ఆరుసార్లు ఎమ్మెల్యేను చేసింది సీఎం కేసీఆర్‌ కాదా? అని ప్రశ్నించారు. ఈటల తల్లిలాంటి పార్టీని గుండెలమీద తన్నారన్నారు. ఈటల గులాబీ జెండాను మోసం చేశారన్నారు. హుజూరాబాద్‌లో ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. దత్తత గ్రామం సిరిసేడులోనూ ఏ ఒక్క పనిచేయలేదన్నారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు పనిచేయని ఈటల ఇప్పుడేం చేస్తారో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ వాళ్లు పైసలు పంచుతున్నారని ఈటల అబంఢాలు వేస్తున్నారని.. టీఆర్ఎస్ గుర్తుపై గెలిచినోళ్లంతా టీఆర్ఎస్ లోనే ఉన్నారన్నారు. గడియారాలు, కుక్కర్లు, కుట్టుమిషన్లు, సెల్ ఫోన్లు పంచుతున్న ఈటల..ఆరుసార్లు పంచని గడియారాలు ఇప్పుడే ఎందుకు పంచుతున్నావని ప్రశ్నించారు. 9 కోట్లతో వెండి కుంకుమ భరిణలు తెప్పించాడని..5 వేల కుట్టుమిషన్లు, 5 వేల గ్రైండర్లు, ప్రెషర్ కుక్కర్లు పంచడం ఆత్మగౌరవమా అన్నారు. 60 రూపాయల గడియారాలిస్తే.. ప్రజలంతా వాటిని నేలకేసి కొడుతున్నారని.. చెప్పేటివి శ్రీరంగ నీతులు.. చేసేవి ఇలాంటి పనులా అన్నారు. ఆషాడ మాసం బోనాలకు పోయినోళ్లకు ఈటల గొర్రెపిల్లలు, మందు బాటిళ్లు పంచాడని.. చెప్పేదొకటి, చేసేదొకటన్నారు.  మేము మాత్రం కేసీఆర్ ఇస్తున్న పథకాలను నమ్ముకుని ముందుకు వెళ్తున్నామన్నారు. 
 

2 గుంటలు వర్సెస్ 200 ఎకరాలు

ఎకరం అమ్మితే ఎన్నికల్లో గెలుస్తానని ఇప్పటికే ఈటల చెప్పాడని.. భూమి అమ్మిన పైసలే ఎన్నికల్లో పెడుతున్నాడన్నారు. గెల్లు శ్రీనివాసుకున్నది 2 గుంటలు, ఈటలకున్నది 200 ఎకరాలని.. ఇప్పుడు పోటీ 2 గుంటలు వర్సెస్ 200 ఎకరాలు అన్నారు. తెలంగాణ కోసం పోరాడి జైలుకు వెళ్లిన నాయకుడు శ్రీనివాస్ అని.. 21 ఏళ్ల పాటు పనిచేసిన గెల్లు శ్రీనివాస్ కు కేసీఆర్ తో పాటు, కేబినెట్ ఆశీర్వాదం ఉందన్నారు. గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని..ఇంతకుముందు కారుకే వేశారు.. ఇప్పుడు కూడా కారుకే ఓటు వేయాలన్నారు. ఈటల రాజేందర్ పంచిన గడియారాల్లో కేవలం పువ్వు గుర్తు మాత్రమే పెట్టాడని.. మోడీ బొమ్మ, అమిత్ షా బొమ్మ పెడితే పెరిగిన ధరలు, ఊడిన ఉద్యోగాలు గుర్తుకు వస్తాయని ఈటల మాయ చేయాలని చూస్తున్నాడన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్న హరీష్..2 గుంటలున్న గెల్లు శ్రీనివాస్ పేదోడు.. గెలిపించండి. మన గుర్తు కారు గుర్తు మరవద్దు. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు.