కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఉంది

కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఉంది

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల్లేవన్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావ్ ఫైర్ అయ్యారు. అద్భుతమైన ప్రాజెక్టు అని కితాబు ఇచ్చిన వాళ్లే ఇప్పుడు అవినీతి జరిగిందని అంటున్నారని విమర్శించారు. బీజేపీకి నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతి అన్నట్లుగా వ్యవహరిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. షెకావత్ వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. పదవులు, పాలిటిక్స్ కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి పార్లమెంటులో ఒక తీరుగా బయట మరో తీరుగా మాట్లాడుతున్నారన్న హరీష్.. కేంద్రం తప్పులను ఎత్తిచూపుతున్నందనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు.  సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్ హుస్సేన్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి అభినందించారని అన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ తో పాటు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టును అభినందించలేదా అని హరీష్ రావు ప్రశ్నించారు.

రబ్బర్ సీళ్ళు ఊడిపోయి పంప్ హౌస్ లోకి నీళ్లు వెళ్లాయి

డీపీఆర్ తయారు చేసింది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ అని హరీష్ రావు అన్నారు. రబ్బర్ సీళ్ళు ఊడిపోయి పంప్ హౌస్ లోకి నీళ్లు వెళ్లాయని.. ప్రకృతి వైపరిత్యం వల్లే పంప్ హౌస్ లు మునిగినట్లు చెప్పారు. 21 పంప్ హౌస్ లు కాళేశ్వరం లో ఉంటే రెండు మాత్రమే మునిగిపోయాయని చెప్పారు. రోశయ్య సీఎం ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. ప్రాజెక్టుకు ఏమైనా ఐదేళ్ల వరకు కంపెనిదే బాధ్యత అని స్పష్టం చేశారు. 

ఉచిత కరెంట్ ఆపేందుకు కేంద్రం కుట్ర

ఉచిత కరెంట్ ఆపేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని.. మరో నెల రోజుల్లో మోటార్లు రెడీ అవుతాయని హరీష్ రావు తెలిపారు. ఒక్క ఎకరాకు నీళ్లు ఇయ్యకపోతే కోటి ఎకరాల్లో పంట ఎలా పండిందని ప్రశ్నించారు. 2014లో 68లక్షల టన్నుల ధాన్యం ఉంటే.. 2021 కి 2వందల లక్షల టన్నులు పండిందని చెప్పారు. మొన్న యాసంగిలో కాళేశ్వరం నీళ్లు 11లక్షల ఎకరాలకు అందాయని చెప్పారు. రక్షణ చర్యల్లో భాగంగానే ప్రతిపక్షాల అడ్డగింత జరుగుతుందని హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం వరదలపై  గోప్యత లేదని..త్వరలోనే ప్రాజెక్టు సందర్శనకు అందర్ని అనుమతిస్తామని తెలిపారు.