
- బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టుల దగ్గర ఫొటోలకు పోజులిస్తున్నరు: హరీశ్ రావు
- 2018లోనే సీడబ్ల్యూసీకి డీపీఆర్‌లను సమర్పించినం
- సీతారామకు అనుమతుల్లేవని ఉత్తమ్ మాట్లాడడం అవగాహనారాహిత్యమని కామెంట్
హైదరాబాద్, వెలుగు: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ప్రాజెక్టుకు అనుమతులు లేవని ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం అవగాహనారాహిత్యమని, టీఏసీ తప్ప అన్ని అనుమతులు తమ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్ట్ దగ్గర ఫొటోలకు పోజులిచ్చి, అదే ప్రాజెక్టుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నదని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2018 అక్టోబర్ 30నే సీతారామ ప్రాజెక్టు డీపీఆర్‌ను సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)కి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందజేశామని హరీశ్ రావు అన్నారు.
అక్కడ 113.795 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2021 సెప్టెంబర్, అక్టోబర్‌లోనే సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం నిర్ధారించిందని గుర్తు చేశారు. 70.4 టీఎంసీలను సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వాడుకోవచ్చని కేంద్రం 2021లో నిర్ధారించిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుకు ఇంత స్పష్టంగా సీడబ్ల్యూసీ హైడ్రాలజీ అనుమతులున్నా.. నీటి కేటాయింపులే జరగలేదంటూ మంత్రి ఉత్తమ్ మాట్లాడడం.. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి దోపిడీకి అడ్డుకోకుండా పదవుల కోసం పెదవులు మూసుకున్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు మరోసారి తెలంగాణ నీటిని అప్పణంగా కిందకు వదులుతూ రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారని అన్నారు.
పరీక్షల ఫలితాలుఏ సీఎం కూడా ఇంట్లో రిలీజ్ చేయలె
77 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ పోటీ పరీక్షల ఫలితాలను.. ఏ సీఎం కూడా తమ ఇంటి నుంచి విడుదల చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తన ఇంటి నుంచి ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేశారని, ఇది తన అహంభావానికి నిదర్శనమని అన్నారు. రేవంత్‌కు పాలన మీద, విద్యార్థుల మీద చులకనభావం ఉన్నట్టు తేలిందన్నారు. సెక్రటేరియెట్ మొహం చూడడం లేదని, ఇటు అధికారులను, అటు పోలీసులను తమ పనిని చేసుకోనివ్వడం లేదని విమర్శించారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని హరీశ్ ప్రశ్నించారు.