పవర్ బ్రోకర్లే.. బీఆర్ఎస్ ను వీడుతున్రు: హరీష్ రావు

పవర్ బ్రోకర్లే.. బీఆర్ఎస్ ను వీడుతున్రు: హరీష్ రావు

BRS పార్టిని వీడుతున్న నేతలపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలు మారే వారు పవర్ బ్రోకర్లని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కొంత మంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపోతున్నారని విమర్శించారు. ఈ మేరకు సిద్దిపేటలో పార్టీ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇదేం పార్టీకి కొత్తకాదు..తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పట్టుమని 10 మంది కూడా పార్టీలో లేరు.. అయినా కేసీఆర్ తెలంగాణ తెచ్చి చూపెట్టారన్నారు.  

ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని హరీష్ రావు చెప్పారు. రాజకీయ నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ.. ఉద్యమకారులను, కార్యకర్తలను కొనలేరన్నారు. మధ్యలో పార్టీలోకి వచ్చినవాళ్ళు పార్టీలోంచి వెళ్లిపోతున్నారని తెలిపారు. పార్టీలోంచి వెళ్లిపోయిన వారిని.. కాళ్ళు మొక్కినా మళ్ళీ పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందన్నారు. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేస్తే.. కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని ఆయన ఫైరయ్యారు. ఇది ఆకులు రాలే కాలం...కొత్త చిగురు మళ్ళీ పార్టీలో పుట్టుకువస్తుందని హరీష్ రావు చెప్పారు.

లోక్ సభ ఎన్నికల ముందు పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లారు. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు రాజ్యసభ ఎంపీ కే కేశవరావు బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు స్పష్టం చేశారు. ఆయన మార్చి 30వ తేదీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా త్వరలో కాంగ్రెస్ చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఆయనను కలిసి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ మార్పుపై రెండు మూడు రోజుల్లో తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు.