మాదిగ పోరాటం అనేది.. ఆత్మ గౌరవ పోరాటం: హరీష్ రావు

మాదిగ పోరాటం అనేది.. ఆత్మ గౌరవ పోరాటం: హరీష్ రావు

ఎస్సీ వర్గీకరణపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి  చిత్తశుద్ది ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని..కానీ కేంద్ర ప్రభుత్వం బిల్లుపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారని ఆయన చెప్పారు.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిర పార్క్ వద్ద  నిర్వహించిన మాదిగ యుద్ద భేరి సభలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు.

మాదిగ పోరాటం అనేది.. ఆత్మ గౌరవ పోరాటమని మంత్రి అన్నారు. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ... ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో  బిఅర్ఎస్ పెద్ద పాత్ర పోషిస్తుందని అన్నారు.కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారని చెప్పార హరీష్ రావు. ప్రతి జిల్లాలో  బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఎస్సీ స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఐఏఎస్ అకాడమీని  బలోపేతం చేశామన్నారు. దళితుల అభివృద్ధి కోసం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని.. అందులో భాగంగానే దళితబంధు తీసుకొచ్చారని తెలిపారు. 

రాష్ట్రంలో 33 ఎస్సీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. నగరంలో సదా లక్ష్మి విగ్రహాన్నా  ఏర్పాటు చేస్తామని.. మాదిగల ఆత్మ గౌరవ బిల్డింగ్ నిర్మిస్తామని ఆయన చెప్పారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ కోసం ఎంత ఖర్చు చేశామో అసెంబ్లీలో చెప్పామన్నారు. మాదిగల పోరాటానికి బిఅర్ఎస్ మద్దత్తు ఉంటుందని అన్నారు. మద్య దుకాణాల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. వచ్చే ప్రభుత్వంలో మాదిగలకు పెద్ద పీట వేస్తామని హామీ ఇస్తున్నానని మంత్రి చెప్పారు.