విద్య, వైద్యం ఉచితంగా అందించాలి: కోదండరామ్

విద్య,  వైద్యం ఉచితంగా అందించాలి: కోదండరామ్

కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తొమ్మిది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని కోదండరామ్ అన్నారు. వాస్తవాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ.. ప్రజా అనుకూల విధానాలను సాధించే ప్రయత్నం చేసే క్రమంలో  ప్రభుత్వం దాడికి దిగటం మొదలు పెట్టిందని ఆరోపించారు. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది బలిదానాలాపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన రావాలన్నారు. నిరంకుశ పాలన అంతమొందించి ప్రజాస్వామిక పాలన రావాలని కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామని చెప్పారు. జేఏసీ  తరుపున ఎజెండాను ప్రతిపాదించామని.. ఆ ఏజండాను కాంగ్రెస్ పార్టీ  ఆమోదించిందని తెలిపారు.  రాష్ట్రంలో నాణ్యమైన విద్య,  వైద్యం ఉచితంగా అందించాలని.. ఉద్యోగ, ఉపాధి కల్పనపైన ప్రధానమైన దృష్టి పెట్టాలని చెప్పారు.

ప్రభుత్వ ఖాళీలను క్యాలండర్ ప్రకారంగా పూర్తి చేయాలని.. కౌలు రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని అన్నారు. రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన సాగాలన్నారు. ఉద్యమ కారుల సంక్షేమం కోసం బోర్డు పెట్టాలని.. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన పిల్లలకు సమగ్ర సహాయం అందించాలన్నారు. ప్రజాస్వామిక  పునాదులు, విలువల మీద తెలంగాణను అభివృద్ధి చేయాలని కోదండరామ్ చెప్పారు.