సిద్దిపేట రూరల్, వెలుగు : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. గురువారం నంగునూరు మండలం నర్మెట్టలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో జరిగిన రైతు మేళా సందర్భంగా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వంటేరు యాదవ రెడ్డిలతో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ నర్మెట్ట గ్రామంలో సగం మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని, మూడు సీజన్లుగా రైతు భరోసా నిధులు, వడగళ్ల వాన నష్టపరిహారం అందలేదని విమర్శించారు. పంట బీమా పథకం అమలుపై ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తూ, సిద్దిపేట నియోజకవర్గానికి రావాల్సిన రూ. 170 కోట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 25 వేల కోట్ల రైతు భరోసా నిధులను ఈ నెల 22న రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు
