
జైపూర్: మహిళల ఐపీఎల్ భవితవ్యానికి కీలకమైన మహిళల టీ20 చాలెంజ్ ఫైనల్ అదిరిపోయే రీతిలో జరిగింది. వెలాసిటీ, సూపర్ నోవాస్ మధ్య జరిగిన టైటిల్ ఫైట్ చివరి బంతి దాకా నువ్వా నేనా అన్నట్టు సాగింది. చివరకు సూపర్ నోవాస్ టైటిల్ దక్కించుకుంది. ధనాధన్ హాఫ్‌సెంచరీతో చెలరేగిన కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) నోవాస్ కు చాంపియన్‌షిప్ టైటిల్ అందించింది. వెలాసిటీతో శనివారం జరిగిన ఫైనల్లో సూపర్ నోవాస్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన వెలాసిటీ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. సుష్మా వర్మ (32 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 నాటౌట్), అమేలియా కెర్ (38 బంతుల్లో 4 ఫోర్లుతో 36) రాణించారు. నోవాస్ బౌలర్లలో తుహుహు (2/21) రెండు వికెట్లు తీసింది. ఛేజింగ్‌లో 20 ఓవర్లు ఆడిన సూపర్ నోవాస్ ఆరు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి చాంపియన్‌గా నిలిచింది. వెలాసిటీ బౌలర్లలో ఆలమ్ రెండు వికెట్లు తీసింది. హర్మన్‌ప్రీత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. జెమీమా రోడ్రిగ్స్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచింది.
హర్మన్ ధనాధన్
స్వల్ప ఛేజింగ్‌లో నోవాస్‌కు రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఆటపట్టు(2) రనౌటవడంతో తొమ్మిది పరుగులకే నోవాస్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ ప్రియా పునియా(29), వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(22)తో కలిసి రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించి నోవాస్ విజయానికి బాటలు వేశారు. అయితే వరుస బంతుల్లో ప్రియా, రోడ్రిగ్స్‌ను ఔట్ చేసిన వెలాసిటీ బౌలర్లు మ్యాచ్‌పై పట్టు బిగించారు. పదో ఓవర్ చివరి బంతికి కెర్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి రోడ్రిగ్స్ వెనుదిరగ్గా, దేవిక వేసిన 11వ ఓవర్ తొలి బంతికి ప్రియా స్టంపౌట్ అయ్యింది. ఆ తర్వాత పేసర్ ఆలమ్ వరుస ఓవర్లలో సివర్(2), సోఫియా డివైన్(3)ను బౌల్డ్ చేసి మ్యాచ్‌లో హీట్‌ను పెంచేసింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ వెలాసిటీ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. చకాచకా పరుగులు సాధిస్తూ లక్ష్యాన్ని కరిగించేసింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. మరో ఎండ్‌లో తుహుహు ఆమెకు చక్కని సహకారం అందించింది. అయితే విజయానికి ఐదు బంతుల్లో ఏడు రన్స్ కావాల్సిన దశలో హర్మన్ ఔటైంది. కెర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన హర్మన్ డీప్ కవర్‌లో మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చింది. దీంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. అయితే తుహుహు, రాధా యాదవ్ కలిసి చివరి బంతికి లక్ష్యాన్ని పూర్తి చేసి మ్యాచ్ ముగించారు.
సుష్మ, కెర్ పోరాటం..
సుష్మా వర్మ, అమెలియా కెర్ పోరాటం వల్ల వెలాసిటీ జట్టు ప్రత్యర్థి ముందు ఓ మాదిరి లక్ష్యాన్ని ఉంచగలిగింది. నోవాస్ బౌలర్ల దెబ్బకు వెలాసిటీ బ్యాటర్లు టపాటపా వికెట్లు పారేసుకున్నారు.ముఖ్యంగా పేసర్ తుహుహు దెబ్బకు ఖాతా తెరవకుండానే వెలాసిటీ తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ హేలీ మాథ్యూస్ (0) డకౌట్ అవ్వగా, వన్‌డౌన్‌లో వచ్చిన డానియెల్ వ్యాట్(0) కూడా ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. అనుజా బౌలింగ్‌లో ఆమె స్టంపౌట్ అయ్యింది. తుహుహు వేసిన తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్ షెఫాలీ వర్మ(11) అనుజాకు సులువైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. వేద కృష్ణమూర్తి(8) కూడా తీవ్రంగా నిరాశపరిచింది. జట్టును ముందుండి నడిపిస్తుందనకున్న కెప్టెన్ మిథాలీ రాజ్(12) కూడా సివర్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి ఔటైంది.దీంతో ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి సగం జట్టు పెవిలియన్ చేరింది. ఈ దశలో సుష్మ వర్మ, అమేలియా కెర్ బాధ్యతగా ఆడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 71 పరుగులు జోడించి జట్టు స్కోరును మూడంకెలకు చేర్చారు. అయితే 19వ ఓవర్లో పూనమ్ యాదవ్ ఈ జంటను విడదీసింది. పూనమ్ వేసిన బంతిని కవర్స్ దిశగా ఆడిన కెర్ అక్కడ హర్మన్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. సివర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో లాంగాన్ దిశగా సుష్మ భారీ సిక్స్ కొట్టింది. చివరి రెండు బంతులకు రెండు డబుల్స్ తీసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించి ఇన్నింగ్స్‌ను ముగించింది.