కెప్టెన్సీకి హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీత్‌‌‌‌ గుడ్‌‌‌‌ బై..సాధారణ ప్లేయర్‌‌‌‌ గా కొనసాగింపు

కెప్టెన్సీకి హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీత్‌‌‌‌ గుడ్‌‌‌‌ బై..సాధారణ ప్లేయర్‌‌‌‌ గా కొనసాగింపు
  •     మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
  •     స్మృతి మంధానాకే కెప్టెన్సీ పగ్గాలు

న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ జట్టు కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం వెల్లడించింది. గత కొన్ని నెలలుగా జట్టు పనితీరును సమీక్షించేందుకు గువాహటిలో జరిగిన బీసీసీఐ సమావేశం తర్వాత 37 ఏళ్ల హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. బోర్డు కార్యదర్శి దేవజిత్‌‌‌‌ సైకియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హర్మన్‌‌‌‌తో పాటు వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ స్మృతి మంధాన, హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ అమోల్‌‌‌‌ మజుందార్‌‌‌‌ పాల్గొన్నారు. ‘ఈ రోజు విమెన్స్‌‌‌‌ టీమిండియా జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌‌‌‌గా ఉన్న నేను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. ఇది అంత సులభమైన నిర్ణయం కాదు. ఇందులో ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు, నా జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు ఉన్నాయి. కెప్టెన్‌‌‌‌గా తప్పుకున్నా.. అన్ని ఫార్మాట్లలో సాధారణ ప్లేయర్‌‌‌‌గా కొనసాగుతా. 

ఆట పట్ల ఉన్న ప్రేమతో ఆడటానికి సిద్ధంగా ఉన్నా’ అని హర్మన్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాలో రాసుకొచ్చింది. 2016లో కెప్టెన్‌‌‌‌గా బాధ్యతలు స్వీకరించిన హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌కు 2022లో వన్డే సారథ్యం దక్కింది. 2023 నుంచి అన్ని ఫార్మాట్లకు నాయకురాలిగా కొనసాగింది. ఇండియా విమెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో గొప్ప క్రికెటర్‌‌‌‌గా పేరు తెచ్చుకున్న హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సారథ్యంలో గతేడాది టీమిండియా తొలి వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ను గెలుచుకుంది. ఇటీవల ఆసియా క్రీడల్లో (టీ20 ఫార్మాట్‌‌‌‌) వరుసగా రెండో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 2022 కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో ఇండియా సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ను అందుకుంది. మొత్తంగా హర్మన్‌‌‌‌ ఇండియా తరఫున 5 టెస్ట్‌‌‌‌లు, 51 వన్డేలు, 155 టీ20ల్లో నాయకత్వం వహించింది. అయితే ఇటీవల బ్యాటింగ్‌‌‌‌లో విఫలమైన హర్మన్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో టీమ్‌‌‌‌ను సెమీస్‌‌‌‌ చేర్చలేకపోయింది. హర్మన్‌‌‌‌ వారసురాలిగా స్టార్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ స్మృతి మంధాన పగ్గాలు చేపట్టింది.