
క్రికెట్ లో వన్ ఆఫ్ ది లెజెండరీ అంపైర్ డిక్కీ బర్డ్ 92 సంవత్సరాల వయసులో మరణించారు. డిక్కీ బర్డ్ మరణ వార్తను యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ మంగళవారం (సెప్టెంబర్ 23) ధృవీకరించింది. "క్రికెట్‌లో అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో హెరాల్డ్ డెన్నిస్ "డిక్కీ" బర్డ్ ఒకరు. 92 సంవత్సరాల వయసులో ఇంట్లో ప్రశాంతంగా మరణించారు". అని యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తీవ్ర విచారంతో ప్రకటనలో తెలిపింది. ఇంగ్లాండ్ కు చెందిన డిక్కీ బర్డ్.. 23 ఏళ్ళ పాటు అంతర్జాతీయ క్రికెట్ లో అంపైరింగ్ చేసిన చరిత్ర ఉంది.
ఇంగ్లాండ్ లో యార్క్‌షైర్ కు చెందిన బర్డ్ మృతి పట్ల ఇంగ్లాండ్ స్పందించింది. " అతను గర్వించదగ్గ యార్క్‌షైర్‌మన్. అందరూ అతన్ని చాలా ఇష్టపడతారు. ఆయన్ని మిస్ అవ్వడం చాలా బాధగా ఉంటుంది. డికీ, శాంతిగా విశ్రాంతి తీసుకోండి". అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ సంతాపాన్ని ప్రకటించింది. 1973 నుంచి 1996 మధ్య సుదీర్ఘ కెరీర్‌లో బర్డ్ 66 టెస్టులతో పాటు 69 వన్డేలకు అంపైరింగ్ చేశాడు. 1996 లో బర్డ్ అంపైరింగ్ చేసిన చివరి టెస్ట్ లో ఇండియా మాజీ కెప్టెన్లు రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ అరంగేట్ర టెస్ట్ కావడం విశేషం. లార్డ్స్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగింది.
►ALSO READ | Asia Cup 2025: ఈ రోజు (సెప్టెంబర్ 23) పాకిస్థాన్ గెలిస్తే రేపు ఇండియాకు అడ్వాంటేజ్.. ఎలాగంటే..?
ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ క్లబ్ యార్క్‌షైర్‌తోబర్డ్ సుదీర్ఘ అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. 1956లో కౌంటీతో తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాడు. 1964లో తన కెరీర్‌ను ముగించిన బర్డ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 93 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలతో 3,314 పరుగులు చేశాడు. క్రికెట్‌కు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా 1986లో MBEగా.. 2012లో OBEగా నియమించబడ్డారు. అంపైరింగ్ లో బర్డ్ నిర్ణయాలు ఖచ్చితంగా ఉండేవి. తన విచిత్రమైన ప్రవర్తన కారణంగా ప్రేక్షకులకు ఆటగాళ్లకు ఆయన ఇష్టమైన ఆటగాడిగా మారాడు. 1973లో తన తొలి టెస్ట్ మ్యాచ్ కు అంపైరింగ్ చేశాడు. 1983లో ఇండియా, వెస్టిండీస్ మధ్య లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌తో సహా మూడు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్‌లో బర్డ్ అంపైరింగ్ చేశాడు.