- సరూర్నగర్, బేగంపేట్ ఘటనలు సుమోటోగా స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: అండాల దందాపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నిరుపేద, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులను ప్రలోభపెట్టి ఏజెంట్లు రంగారెడ్డి జిల్లా సరూర్నగర్, హైదరాబాద్జిల్లాలోని బేగంపేట్ ప్రాంతాలకు తీసుకొచ్చి, అండాలు సేకరిస్తున్న విషయమై పేపర్లు, టీవీల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది. ఈ దారుణంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్లకు మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజారమణ మంగళవారం నోటీసులిచ్చారు.
యువతులకు ఇష్టానుసారంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తూ, వైద్య నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు చేస్తూ వారి ప్రాణాలతోపాటు శారీరక, పునరుత్పత్తి ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా చర్యలను తీవ్రమైన మానవ అక్రమ రవాణాగా, మహిళల హక్కులు, గౌరవానికి భంగం కలిగించే అంశంగా కమిషన్ పరిగణించింది. ఈ ముఠాల వెనుక ప్రైవేట్ హాస్పిటల్స్, ఫెర్టిలిటీ సెంటర్లు, కొందరు డాక్టర్ల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇప్పటివరకు ఎంతమంది బాధితులను కాపాడారు, వారికి అందించిన వైద్య సాయం, పునరావాస వివరాలను తెలపాలని స్పష్టం చేసింది. నిందితులపై నమోదు చేసిన కేసులు, తీసుకున్న చర్యలతో కూడిన నివేదికను వెంటనే సమర్పించాలని సూచించింది.
