హర్యానాలోని క్లబ్బులో దారుణం.. వెయిటర్​ను కారుతో ఈడ్చుకెళ్లిన్రు

హర్యానాలోని క్లబ్బులో దారుణం..  వెయిటర్​ను కారుతో ఈడ్చుకెళ్లిన్రు

చండీగఢ్ :  హర్యానాలోని పంచకులలో ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. సెక్టార్ 20లోని ఓ నైట్‌‌క్లబ్‌‌లో ఫుల్ గా మద్యం తాగిన కొందరు యువకులు..బిల్లు విషయంలో గొడవ పడి క్లబ్ వెయిటర్‌‌ను కారుతో 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. దాంతో వెయిటర్‌‌  రెండు చేతులు విరిగిపోవడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ముగ్గురు అమ్మాయిలతో కలిసి నైట్‌‌క్లబ్‌‌కు వచ్చిన ఇద్దరు యువకులు.. రాత్రంతా మద్యం సేవించి అక్కడే డిన్నర్ చేశారు. బిల్లు రూ.23 వేలు అయ్యింది. 

పార్టీ ముగిశాక తెల్లవారుజామున 4 గంటలకు వెయిటర్ జయంత్‌‌(18) వారి దగ్గరకు వెళ్లాడు. బిల్లు రూ.23 వేలు అయ్యిందని..వెంటనే చెల్లించాలని కోరాడు. మద్యం మత్తులో ఉన్న ఐదుగురు బిల్లు విషయంలో  వెయిటర్‌‌తో గొడవకు దిగారు. దాంతో క్లబ్‌‌ బౌన్సర్లు వారి దగ్గరకు వెళ్లి..గొడవను ఆపే ప్రయత్నం చేశారు. గొడవలో బౌన్సర్లు ఇన్వాల్వ్​ కావడంతో భయపడిన ఓ యువకుడు..తన స్నేహితులకు ఫోన్ చేసి నైట్‌‌క్లబ్‌‌కు పిలిపించాడు. దాంతో  మరో 12 మంది యువకులు రెండు కార్లలో  క్లబ్ వద్దకు చేరుకుని..అక్కడున్న సిబ్బందిపై కర్రలు, కత్తులతో ఇష్టమొచ్చినట్లు దాడి చేశారు. 

క్లబ్‌‌ వద్ద జనం గుమిగూడడంతో యువకులు తమ కార్లల్లో పారిపోయేందుకు ప్రయత్నించారు. అది చూసిన వెయిటర్ జయంత్ వారిని ఆపడానికి కారును వెంబడించాడు. యువకులు కారును ఆపకపోగా..అడ్డుగా వచ్చిన జయంత్ ను ఢీకొట్టి100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. అతను కిందపడిపోగానే అక్కడి నుంచి పారిపోయారు.  గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.