దీన్ దయాల్ ఉపాధ్యాయ గొప్ప రాజనీతిజ్ఞుడు

దీన్ దయాల్ ఉపాధ్యాయ గొప్ప రాజనీతిజ్ఞుడు

మల్కాజిగిరి: పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గొప్ప దేశభక్తుడని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. మల్కాజిగిరి ఆనంద్ బాగ్ లోని బృందావన్ గార్డెన్ లో దీన్ దయాల్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ అతి సామాన్య కుటుంబంలో పుట్టి గొప్ప వ్యక్తిగా ఎదిగారన్నారు. స్కాలర్ షిప్ తో చదివి అపర మేధావిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. దీన్ దయాల్ లో ఒక చరిత్రకారుడు, రచయిత, రాజనీతిజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఉన్నారని చెప్పారు.

భారతీయ సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసిన వాళ్లలో దీన్ దయాల్ ఉపాధ్యాయ ఒకరన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, జన్ సంఘ్ పార్టీ కార్యదర్శిగా దీన్ దయాల్ సేవలు మరువలేనివని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు మాట్లాడుతూ.. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అఖండ భారత్ కోసం ఎంతో కృషి చేశారని, దేశ విభజన వెనుక ఉన్న కుట్రలను వేలెత్తి చూపారని తెలిపారు.