అమిత్‌షా, న‌డ్డాల‌తో కాంగ్రెస్ బ‌హిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్‌

అమిత్‌షా, న‌డ్డాల‌తో కాంగ్రెస్ బ‌హిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్‌

కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌హిష్కర‌ణ‌కు గురైన హ‌ర్యానా ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయి ఆదివారం (జులై 10న) కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డాతో స‌మావేశ‌మ‌య్యారు. ఇప్పటికే కుల్దీప్ బిష్ణోయి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో నడ్డా, అమిత్ షాతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన రాజ్యస‌భ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు కుల్దీప్ బిష్ణోయ్‌ను కాంగ్రెస్ బ‌హిష్కరించింది. బీజేపీ మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మకు ఓటు వేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 

దివంగత మాజీ ముఖ్యమంత్రి భ‌జన్‌లాల్ చిన్న కొడుకే కుల్దీప్ బిష్ణోయ్‌. హ‌ర్యానా పీసీసీ అధ్యక్ష ప‌ద‌వికి త‌న పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్లక్ష్యం చేస్తున్నప్పటి నుంచి బిష్ణోయ్ నిర‌స‌న గ‌ళం వినిపిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో అమిత్‌ షా, న‌డ్డాతో భేటీ అయిన బిష్ణోయ్ వారిని ప్రశంస‌ల్లో ముంచెత్తారు. వారితో క‌లిసిన ఫొటోల‌ను ట్విట్టర్‌లో బిష్ణోయ్ పోస్ట్ చేశారు. త‌న మ‌ద్దతుదారుల‌తో సంప్రదించిన త‌ర్వాత‌, త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల సంక్షేమం కోసం త‌న భ‌విష్యత్ నిర్ణయం ఉంటుంద‌ని చెప్పారు.