
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజాహెగ్డే, మరోవైపు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. ఆమె సల్మాన్ ఖాన్‌కి జంటగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ వచ్చే నెలలో విడుదలవుతోంది. ఈలోపే ఈ జంటపై క్రేజీ న్యూస్ ఒకటి బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. సల్మాన్, పూజా కలిసి మరో మూవీలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ‘భజరంగీ భాయిజాన్’తో సూపర్ సక్సెస్ అందుకున్న సల్మాన్.. దీనికి సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పవన పుత్ర భాయిజాన్’ అనే టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారట.
ఫస్ట్ పార్ట్‌లో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించింది. సీక్వెల్‌లో ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోవాలనుకున్న మేకర్స్.. పూజా హెగ్డేను సంప్రదించారట. పూజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి ఆల్రెడీ ఓ సినిమాలో నటించడంతో ఈ కాంబినేషన్ కన్‌ఫర్మ్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఫస్ట్ పార్ట్‌ను డైరెక్ట్ చేసిన కబీర్ ఖాన్.. ఇప్పుడు రెండో పార్ట్ ను తెరకెక్కిస్తాడా లేదా వేరే దర్శకుడి చేతిలో పెడతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబుకి జంటగా నటిస్తోంది పూజాహెగ్డే. త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.