యాదాద్రి జిల్లాలో హాష్​ ఆయి ల్, గంజాయి దందా

యాదాద్రి జిల్లాలో హాష్​ ఆయి ల్, గంజాయి దందా

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో హాష్​ ఆయి ల్, గంజాయి దందా ఆగడం లేదు. లోకల్​గా అమ్ము తూ, జిల్లా మీదుగా భారీ మొత్తంలో తరలిస్తూ వరుసగా పట్టుపడుతున్నా వ్యాపారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఆంధ్ర, -ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి జిల్లా మీదుగా వెళ్లే విజయవాడ, వరంగల్​ హైవేల మీదుగా యథేచ్ఛగా హైదరాబాద్​, మహారాష్ట్రకు రవాణా చేస్తున్నారు. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాతోపాటు తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నారు. 

భారీ ఆఫర్లు..!

గంజాయి రవాణా చేయడానికి పెద్ద మొత్తంలో ఆఫర్​ చేయడంతో వెహికల్స్​యజమానులు ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఒడిశాలోని మల్కాన్​గిరి నుంచి హైదరాబాద్, మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​​కు గంజాయి తరలించడానికి కిలో రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకూ చెల్లిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ లెక్కన క్వింటాల్​కు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల ఆదాయం వస్తుండటంతో వెహికల్స్​ యజమానులు కేసులు అవుతాయని తెలిసినా ముందుకు వస్తున్నట్టు సమాచారం. 

రూట్​ మారుస్తున్రు.. 

ఇటీవల పోలీసుల నిఘా పెరగడంతో  వ్యాపారులు కొత్త మార్గాల గుండా రవాణా చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, తిర్మలగిరి యాదాద్రి జిల్లాలోని మోత్కూరు, వలిగొండ, ఆలేరు, భువనగిరి నుంచి హైదరాబాద్​ వైపునకు ఇటీవల రవాణా జరుగుతోందని తెలుస్తోంది. తరలించేందుకు వెహికల్స్​ కింద అరలు ఏర్పాటు చేయడం, కొబ్బరి బొండాల మధ్యలో గంజాయి బస్తాలను తరలించడం లాంటి ట్రిక్స్​ వాడుతున్నారు. 

రవాణాకు సులువుగా హాష్​ ఆయిల్..​

తరలించేందుకు సులువుగా ఉంటుందన్న కారణంతో  వ్యాపారులు గంజాయి నుంచి తీసిన హాష్​ఆయిల్​ రవాణాపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. 50 కిలోల గంజాయికి రూ. 75 వేల నుంచి రూ. లక్ష వరకూ ఉంటుంది. అయితే 50 కిలోల గంజాయి నుంచి లీటర్​ హాష్​ ఆయిల్ మాత్రమే లభిస్తుంది. దీని ఖరీదు లీటర్​కు రూ. 2 లక్షలు ఉంటుంది. రూ. లక్ష వరకూ లాభం ఉండడం, లీటర్​ బాటిల్​ను చిన్న బ్యాగులో వేసుకొని ఈజీగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వ్యాపారులు ఈ తరహా వ్యాపారంపై ఫోకస్​ పెడుతున్నారు. గతంలో రామన్నపేట బస్టాండ్​లో రెండు లీటర్ల హాష్​ ఆయిల్​తో ఓ వ్యక్తి పట్టబడిన విషయం తెలిసిందే.

యువతే టార్గెట్.. 

నగర శివారు ప్రాంతాల్లోని యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. యాదాద్రి జిల్లా హైదరాబాద్​కు దగ్గరలో ఉండటంతో ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, తదితర వృత్తి విద్యా కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్​ను ఎంచుకొని గంజాయి, హాష్ ​ఆయిల్​ను విక్రయిస్తున్నారు. గంజాయిని చిన్న పొట్లాలుగా మార్చి విక్రయిస్తున్నారు. దీంతో చాలామంది విద్యార్థులు చదువును పక్కనపెట్టి గంజాయికి బానిసలవుతూ బతుకులు ఆగం చేసుకుంటున్నారు. 

కొన్ని ఘటనలు పరిశీలిస్తే.. 

గతేడాది ఆగస్టు 8న  హైదరాబాద్​కు చెందిన  సందీప్ ఏపీలోని అరకు నుంచి హైదరాబాద్​ కు రెండు లీటర్ల హాష్​ ఆయిల్​ తీసుకెళ్తుండగా యాదాద్రి జిల్లా రామన్నపేట బస్టాండ్​లో పోలీసులకు పట్టుబడ్డాడు. గతేడాది అక్టోబర్​ 3న జాతీయ రహదారి 163పై యాదాద్రి జిల్లా ఆలేరు శివారులోకి ఓ డీసీఎంలో 900 కిలోలు  క్వింటాళ్ల గంజాయి పెట్టి పైన కొబ్బరికాయలతో కవర్​ చేసి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 4న వలిగొండ క్రాస్​రోడ్డు వద్ద డీసీఎం పై ఇనుప రేకు మధ్యలో పేర్చిన 400 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొని ఎనిమిది గంటల్లోనే అమ్మకం, రవాణాలో భాగస్వాములుగా ఉన్న వారందరినీ అరెస్ట్​ చేశారు. ఇటీవల మోత్కూరులోని ఓ వ్యక్తి గంజాయిని చిన్న పొట్లాలుగా మార్చి ఒక్కోటి రూ. 300 నుంచి 400 చొప్పున విక్రయిస్తుండగా పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు. 25 చిన్న ప్యాకెట్లలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

చర్యలు తీసుకుంటున్నాం 

గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దీంతో జరిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. గంజాయికి ఎక్కువ డిమాండ్​ ఉండటంతో వ్యాపారులు దొడ్డిదారుల్లో రవాణా చేస్తున్నారు. వారి ఇన్ఫర్మేషన్​ స్థానికులకు తెలిస్తే వెంటనే పోలీసులకు చెప్పాలి.  
- రాజేశ్​చంద్ర, డీసీపీ, యాదాద్రి జోన్​