ఫ్యాక్టరీల పొల్యూషన్​తో..హత్నూర ఆగమాగం!

ఫ్యాక్టరీల పొల్యూషన్​తో..హత్నూర ఆగమాగం!
  • గుండ్లమాచునూర్ పరిధిలో విద్యార్థులకు వాంతులు.. తలనొప్పులు 
  • ఆయా గ్రామాల్లో హెల్త్ ప్రాబ్లమ్స్.. పట్టించుకోని ఆఫీసర్లు
  • వాసన భరించలేక హైకోర్టు జడ్జికి స్టూడెంట్ కంప్లైంట్
  • సుమోటోగా స్వీకరించి అధికారులకు నోటీసులు జారీ

సంగారెడ్డి (హత్నూర), వెలుగు :  సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువగా ఉంది. ఇక్కడ దాదాపు 35 ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందులో 12 కాలుష్య పరిశ్రమలు ఉన్నాయి. పొల్యూషన్ ఫ్యాక్టరీలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా బయటకు వదిలే పొగ, వ్యర్థాలతో పరిసర  ప్రాంతాలు కలుషితమవుతున్నాయి. ఈ ఎఫెక్ట్​ స్థానికంగా ఉండే 30కి పైగా గ్రామాలపై పడుతోంది. రైతులు ఎవుసం వదిలేసి అదే ఫ్యాక్టరీల్లో కూలీలుగా చేరుతున్న పరిస్థితి నెలకొంది. స్థానికంగా 800 ఎకరాల భూములు బీడువారాయి. ఇప్పుడు ఈ సమస్య పిల్లల చదువులను కూడా ప్రభావితం చేస్తోంది. హత్నూర మండలం గుండ్లమాచునూర్ మోడల్ స్కూల్ లో సుమారు 600 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఈ స్కూల్ కు వెళ్లే దారిలో పొల్యూషన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవి వదిలే విషవాయువులు, దుర్వాసనతో స్టూడెంట్స్, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది విద్యార్థులు స్కూల్ విడిచి వెళ్లిపోతున్నారు.  ఘాటైన దుర్వాసనతో పిల్లలకు తలనొప్పులు వస్తున్నాయని,  వాంతులు చేసుకుంటున్నారని స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

హైకోర్టు జడ్జికి ఫిర్యాదు.. 
పొల్యూషన్ కారణంగా చదువుపై ధ్యాస పెట్టలేక పోతున్నామని గుండ్లమాచునూర్ మోడల్ స్కూల్​లో 9వ తరగతి చదువుతున్న కె.సిద్ధార్థ వారం రోజుల కింద హైకోర్టు జడ్జికి ఫిర్యాదు చేశాడు. దీన్ని సుమోటోగా తీసుకున్న హైకోర్టు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న పొల్యూషన్ ఫ్యాక్టరీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. సంజాయిషీ ఇవ్వాలని పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విద్యా, రెవెన్యూ శాఖలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే స్టూడెంట్ న్యాయమూర్తికి లేఖ రాయాల్సి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.  

వాసనతో ఇబ్బంది పడుతున్నాం..
స్కూల్ కు దగ్గరలో ఉన్న పొల్యూషన్ ఫ్యాక్టరీలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మార్నింగ్ ప్రేయర్ టైంలో ఘాటైన దుర్వాసన వస్తోంది. చాలా మంది విద్యార్థులకు తలనొప్పులు వస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అందుకే హైకోర్టు న్యాయమూర్తికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. సమస్యను త్వరగా పరిష్కరించాలి. 
- కె.సిద్ధార్థ, మోడల్ ​స్కూల్​ స్టూడెంట్

ఫ్యాక్టరీలను తొలగించండి
ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న పొల్యూషన్ ఫ్యాక్టరీలను వెంటనే తొలగించాలి. విష వాయువులతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ఇప్పుడు పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. వారి చదువులకు ఆటంకం కలుగుతోంది. సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు చెప్పాం. ఎవరూ పట్టించుకోవట్లే.. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. 
- శ్రీశైలం, గుండ్ల మాచనూర్