- పరారీలోనే భోలే బాబా.. రాజస్థాన్ వెళ్లినట్టు అనుమానాలు
- దేవప్రకాశ్ మధుకర్‌ను పట్టిస్తే లక్ష నజరానా
- ప్రకటించిన అలీగఢ్ పోలీసులు
- నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
- ఎఫ్ఐఆర్లో భోలేబాబా పేరు చేర్చని పోలీసులు
- రాజస్థాన్ కు పరారీ?
హత్రాస్: యూపీలోని హత్రాస్ సత్సంగ్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్గనైజర్‌తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఆరుగురు సత్సంగ్ వద్ద ‘సేవాదార్స్’ (వాలంటీర్లు)గా ఉన్నారని అలీగఢ్ రేంజ్ ఐజీ షలాభ్ మాథూర్ చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం ఆయన మీడియాకు వెల్లడించారు.
‘‘కీలక నిందితుడు దేవప్రకాశ్ మధుకర్ పరారీలో ఉన్నాడు. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశాం. అతని ఆచూకీ చెప్తే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించాం. సత్సంగ్ తర్వాతి నుంచి భోలే బాబా పరారీలో ఉన్నాడు. ఇప్పటికీ అతని ఆచూకీ దొరకలేదు. అవసరమైతే అతన్ని కూడా ప్రశ్నిస్తాం” అని ఐజీ మాథూర్ తెలిపారు.
డెడ్‌బాడీల గుర్తింపు.. కుటుంబసభ్యులకు అప్పగింత
తొక్కిసలాట ఘటనలో భోలే బాబా పాత్రపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆర్గనైజర్ల వైఫల్యం కారణంగానే 121 మంది చనిపోయారని పోలీసులు చెప్పారు. ఎఫ్ఐఆర్లో నిర్వాహకుల పేర్లు మాత్రమే ఉన్నాయని, భోలేబాబా పేరు ఇంకా చేర్చలేదని తెలిపారు. ఆర్గనైజింగ్ కమిటీ పోలీసుల నుంచి సత్సంగ్ కోసం పర్మిషన్ తీసుకున్నది. గతంలో కూడా చాలా చోట్ల తక్కువ మందితో సత్సంగ్ నిర్వహిస్తామని పర్మిషన్ తీసుకున్నా.. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారని పోలీసులు తెలిపారు.
హత్రాస్‌లోనూ అదే జరిగిందని చెప్పారు. ఆర్గనైజింగ్ కమిటీతో పాటు ప్యానెల్ సభ్యులను అరెస్ట్ చేశారు. చనిపోయిన వారందరి మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులు గుర్తించారు. డెడ్‌బాడీలను గురువారం అప్పగించారు. చివరిగా ఒక డెడ్‌బాడీని కుటుంబ సభ్యులు వీడియో కాల్ ద్వారా గుర్తు పట్టారు.
బ్లాక్ కమెండోల సాయంతో భోలేబాబా పరార్
గంటన్నర పాటు ప్రవచనాలు చేశాక సత్సంగ్ పాయింట్ నుంచి భోలే బాబా టైట్ సెక్యూరిటీతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న కమెండోల భద్రత మధ్య అతడు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీతో స్పష్టమవుతున్నది. రెండు వరుసల్లో బ్లాక్ కమెండోలు టూవీలర్లతో ముందు వెళ్లగా.. వాళ్లను భోలే బాబా కాన్వాయ్ అనుసరించింది. దీనికి సంబంధించిన 47 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
భోలే బాబాగా పేరొందిన జగత్ గురు సాకార్ విశ్వహరి కోసం ఘటన తర్వాత నుంచీ పోలీసులు గాలిస్తున్నారు. మెయిన్‌పురిలో నిరామ్ కుటీర్ చారిటబుల్ ఆశ్రమంలో భోలే బాబా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆశ్రమంలో 40 నుంచి 50 మంది సేవాదార్‌లు ఉన్నారే తప్ప.. భోలేబాబా ఆచూకీ మాత్రం దొరకలేదు. తొక్కిసలాట జరిగినట్టు తెలుసుకున్న వెంటనే భోలేబాబా రాజస్థాన్‌కు పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో సందర్శిస్తారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ ఘటన బాధాకరమన్నారు. గాయపడిన వారిని కూడా రాహుల్ పరామర్శిస్తారని వెల్లడించారు.
