
చెన్నై: ఒక తమిళుడిగా చెప్పడానికి చాలా ఉందని, కానీ కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడతానని ప్రముఖ నటుడు, -మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమలహాసన్ అన్నారు. గురువారం రిలీజ్ కానున్న తన ‘థగ్ లైఫ్’ సినిమాపై బుధవారం చెన్నైలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ఇది ప్రజాస్వామ్యం. నేను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతా. కర్నాటక, తెలంగాణ, ఏపీ, కేరళ పట్ల నా ప్రేమ నిజం.
ఒక అజెండాతో ఉన్న కొందరే దాన్ని అనుమానిస్తారు. నేను తప్పు చేస్తే క్షమాపణ చెబుతాను, లేకపోతే చెప్పను’’ అని అన్నారు. గతవారం కమల్ చేసిన ‘తమిళం నుంచి కన్నడం భాష పుట్టింది’ అనే కామెంట్లు కర్నాటకలో పెద్ద వివాదాన్ని సృష్టించాయి. కాగా, ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలయ్యే వరకు రాజ్యసభ నామినేషన్ దాఖలును వాయిదా వేసినట్టు కమల హాసన్ తెలిపారు. ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కు మద్దతు ఇచ్చారు. అప్పుడు కమల్‌కు రాజ్యసభ సీటును ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చింది.