V6 News

ఈ ‘బర్రె’ నవల చదివారా..? ఇది బర్రె ఆత్మకథలా అనిపించినా.. మనిషి పుట్టించిన మాయ రోగమైన వివక్షపై సెటైర్ !

ఈ ‘బర్రె’ నవల చదివారా..? ఇది బర్రె ఆత్మకథలా అనిపించినా.. మనిషి పుట్టించిన మాయ రోగమైన వివక్షపై సెటైర్ !

ఈ నవలలో ఏముందో తెలియడానికంటే ముందు అలీగరీ పద్ధతి గురించి పాఠకులు తెలుసుకోవాలి. అలీగరీ పద్ధతి అంటే సాహిత్యంలో ఒక ప్రత్యేక రచనా శైలి లేదా సాహిత్య సాధనం. ఇది ఒక కథ, కవిత, నాటకం లేదా చిత్రం రూపంలో ఉంటుంది. ఒక సాధారణ కథగా కనిపిస్తుంది, కానీ లోతైన అర్థం వేరే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏదైనా నైతిక పాఠం, రాజకీయ విమర్శ, ఆధ్యాత్మిక సందేశం లేదా సామాజిక వాస్తవాలు ఉంటాయి. అంటే.. పాత్రలు, సంఘటనలు, స్థలాలు అన్నీ కథలో ప్రతీకలుగా పనిచేస్తాయి.

జార్జ్ ఆర్వెల్ రాసిన ‘యానిమల్ ఫామ్’ గురించి తెలిసిందే. ఒక ఫామ్‌‌‌‌లో జంతువులు తమ యజమానిని తరిమేసి, సమానత్వంతో ఫామ్‌‌‌‌ను నడుపుతాయి. ఇందులోని లోతైన అర్థం.. రష్యన్ విప్లవం, స్టాలిన్ డిక్టేటర్‌‌‌‌షిప్ గురించి విమర్శ ఉంటుంది. జంతువులు రాజకీయ నాయకులను, ఫామ్ సమాజాన్ని సూచిస్తాయి. తెలుగు సాహిత్యంలో నీతి కథలు, పురాణాల్లోని కొన్ని భాగాలు అలీగరీ లాగా పనిచేస్తాయి. అలీగరీ అనేది కేవలం కథ చెప్పడం కాదు, కథ ద్వారా ఒక పెద్ద సందేశాన్ని తెలియజేయడం. ఇది పాఠకుడిని ఆలోచింపజేస్తుంది. ఆ కోవకు చెందిందే ఈ ‘బర్రె’ నవల కూడా.

మనిషి పుట్టించిన మాయ రోగం వివక్ష. కులం, మతం, ప్రాంతం, భాష, యాస, రంగు, రూపం.. అన్నీ దీనికి ఆయుధాలే. సమాజంలో ఎప్పుడు చొరబడిందో తెలియని ఈ మహమ్మారి..  భస్మాసురహస్తంలా  మారి మనుషుల్ని బలి తీసుకోవడమే కాదు, మూగ జీవులనూ వేధిస్తోంది. అలాంటి ఓ జంతువు ఆవేదనే ‘బర్రె’ నవల. పుట్టినప్పటి నుంచి చనిపోయే/ కబేళాకు తరలిపోయే వరకు ఎన్నో కుటుంబాలకు ఆదరువుగా నిలిచే బర్రెల పట్ల మనిషి, సమాజం ప్రవర్తించే తీరును ఈ నవల స్పృశిస్తుంది. 

చూడడానికి ఓ బర్రె ఆత్మకథలా కనిపించినా, సమాజం పోకడలపై ప్రశ్నలు సంధిస్తుంది.  తమ నలుపు రంగే వివక్షకు కారణమని భావించే బర్రె.. దానికి తామెలా బాధ్యులమవుతామంటూ ఆవేదన చెందుతుంది. పాలు, పెరుగు, వెన్న , నెయ్యి వంటివి అందించి, ఆకలి తీర్చడంతోపాటు  ఆర్థికంగానూ ఆదుకునే తమ జాతిని సమాజం చిన్నచూపు చూడడం తగదని రోదిస్తుంది. ఆ క్రమంలో ఆవుపై అసూయ చెందుతుంది.

ఒక్క రంగు మాత్రమే తేడా.. మిగిలిన అన్ని విషయాల్లోనూ ఆవులతో తాము సమానమైనా వాటికి ఉండే గుర్తింపు, గౌరవం తమకు లేదని బాధపడుతుంది. అయితే, మనిషి అవసరం ఉన్నంతవరకే.. ఆవులకూ విలువ, ఆ తర్వాత వాటి పరిస్థితీ తమలాగే తయారవుతుందని తెలిశాక ఆశ్చర్యపోతుంది. ఇన్ని అనర్థాలకు కారణమైన వివక్షను పెంచి పోషిస్తున్న దొరలు/రాజకీయ నాయకులపై కోపం పెంచుకుంటుంది. అలాంటి వాళ్లలో ఒకరిద్దరిని కొమ్ములతో కుమ్మి తన పగ తీర్చుకుంటుంది. ఇదీ స్థూలంగా ఈ నవల సారాంశం.

బర్రెను ప్రధాన పాత్రలో తీసుకుని, అలీగరీ పద్ధతిలో రచయిత కె.వి.నరేందర్​ ఈ నవల రాశారు. పైకి కనిపించే పాత్ర ఒకటైతే, అంతర్లీనంగా అది మరొక వ్యక్తిని లేదా పాత్రను/సమాజం తీరును ప్రతిఫలించేలా ఉండడమే ఈ పద్ధతి. ఆ ప్రకారంగా ఈ నవలను అట్టడుగు వర్గాలు, దళితులు ఎదుర్కొంటున్న వివక్షపై రాసినట్లు కనిపిస్తుంది. దీనికి తగినట్లే తెలంగాణలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ప్రస్తావించారు.

వాస్తవానికి సమాజంలోని వివిధ రకాల వివక్షపై అనేక కథలు, నవలలు వచ్చినప్పటికీ.. ఈ పుస్తకంలో మాత్రం  ఒక జంతువును ప్రధానంగా చూపుతూ, వివక్షపై దాని వేదనను ఆవిష్కరించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే, ఈ క్రమంలో బర్రె ఆవేదన అక్కడక్కడా కొంచెం శృతి మించినట్లు పాఠకులు భావించే ప్రమాదం లేకపోలేదు. 

శివాలయంలో నంది విగ్రహాన్ని బర్రె చూసిన సందర్భంలోను.. ఆవులపై అసూయను ప్రస్తావించే సమయాల్లోను, ముగింపులోనూ గాఢత ఎక్కువైనట్లు అనిపిస్తుంది.  ఇక నవలలో కథనం, శైలి బాగునప్పటికీ బర్రె ఆవేదన పునరుక్తిని తలపిస్తుంది. అక్షర దోషాలు, అన్వయ లోపాలు అక్కడక్కడా ఇబ్బంది పెట్టినా.. అచ్చమైన తెలంగాణ పదాలు మురిపిస్తాయి.

ఎన్నో కథలు, నవలలు రాసి ప్రభుత్వ పురస్కారాలు అందుకుని, తెలంగాణ/తెలుగు సాహిత్యంలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రచయిత కె.వి.నరేందర్​. ఇదే నవల పేరుతో ఆయన రాసిన బర్రె కథతోపాటు దొరుంచుకున్న దేవక్క, దొర మల్లా వచ్చిండు, నడిపోడు, ఉసిల్లు, ముంపు.. తదితర రచనలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. 

మహేశ్వర్

* లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ​ఐడీ featureseditor@v6velugu.com