అమెరికాపై ఫోకస్ పెట్టిన నైసార్ శాటిలైట్.. స్పేస్ నుంచి తొలిసారి పంపిన ఫోటోలు ఇవే.. !

అమెరికాపై ఫోకస్ పెట్టిన నైసార్ శాటిలైట్.. స్పేస్ నుంచి తొలిసారి పంపిన ఫోటోలు ఇవే.. !

ఇస్రో, నాసా సంయుక్తంగా ప్రయోగించిన నైసార్ ( నాసా-ఇస్రో సింథటిక్‌ ఎపెర్చర్‌ రాడార్‌ ) శాటిలైట్ తన పని ప్రారంభించింది. జులై 30న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ  శాటిలైట్ ఫోటోలు శనివారం ( సెప్టెంబర్ 27 ) విడుదల చేశారు. ఈ శాటిలైట్ లోని ఎస్‌-బ్యాండ్‌ రాడార్‌ను ఇస్రో, ఎల్‌-బ్యాండ్‌ రాడార్‌ను నాసా రూపొందించాయి. ఎల్‌-బ్యాండ్‌ రాడార్‌.. గత నెలలో రెండుసార్లు అమెరికాలోని పలు ప్రాంతాలపై దృష్టి సారించింది. ఆగస్టు 21న మెయిన్‌ రాష్ట్రంలోని మౌంట్‌ డెజర్ట్‌ ఐలాండ్ ను చిత్రీకరించింది. 

అడవులు, జలమార్గాలు, పట్టణ నిర్మాణాలు, భవనాలు, వృక్ష సంపద, నీటి వనరులకు సంబంధించిన వివరాలను ఫోటోల రూపంలో పంపింది నైసార్. రెండు రోజుల తర్వాత ఉత్తర డకోటాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములు, చిత్తడి నేలలు, అడవులు, నీటిపారుదల ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు తీసింది నైసార్. సోయాబీన్స్, మొక్కజొన్న పంటలను కూడా ఈ ఫోటోలలో కవర్ చేసింది నైసార్.

జులై 30న ఏపీలోని శ్రీహరికోట ‘షార్’ అంతరిక్ష కేంద్రం నుంచి 5:40 గంటలకు నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ 19 నిమిషాల ప్రయాణం తర్వాత నిసార్ శాటిలైట్‎ను నిర్దేశిత 745 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేర్చింది. ఐదేండ్లపాటు సేవలు అందించే నిసార్ శాటిలైట్ 3 నెలల తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. 

నిసార్ శాటిలైట్ ప్రాజెక్టును ఇస్రో, నాసా పదేండ్ల క్రితం ప్రారంభించాయి. ప్రపంచంలోనే తొలిసారిగా ఇందులో రెండు ఫ్రీక్వెన్సీలతో కూడిన ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ రాడార్లను అమర్చారు. ఎల్ బ్యాండ్ రాడార్‎ను నాసా, ఎస్ బ్యాండ్ రాడార్‎ను ఇస్రో తయారు చేశాయి. 12 మీటర్ల వెడల్పుతో కూడిన భారీ యాంటెన్నాను జోడించారు. 2 వేల 393 కిలోల బరువైన ఈ శాటిలైట్ తయారీకి 1.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు