కాలేజీకి రాలేదని..పరీక్షలకు అనుమతించకపోతే ఎలా?: హైకోర్టు

కాలేజీకి రాలేదని..పరీక్షలకు అనుమతించకపోతే ఎలా?: హైకోర్టు
  •     విద్యా శాఖను హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: అనారోగ్యం కారణంగా విద్యార్థుల హాజరు శాతం తగ్గినప్పటికీ, దానిని తీవ్రంగా పరిగణించొద్దని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖకు హైకోర్టు ఆదేశించింది. ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు పిటిషనర్‌‌ను అనుమతించాలని స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజ్‌‌గిరి జిల్లా కీసరలోని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్)లో కొండపర్తి మాన్విత బీటెక్ మూడో సంవత్సరం (2024~-25)చదువుతున్నది. అయితే, అటెండెన్స్ లేదని కాలేజీ యాజమాన్యం ఆమెను పరీక్షలకు అనుమతించలేదు. దాంతో మాన్విత కాలేజీ జారీ చేసిన సర్క్యులర్‌‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. 

ఈ పిటిషన్‌‌ను జస్టిస్ కె. శరత్ విచారించారు.  పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీకాంత్ రెడ్డి వాదిస్తూ.. మాన్విత ఎగ్జామ్ ఫీజు చెల్లించినప్పటికీ అనారోగ్యం కారణంగా కాలేజీకి హాజరు కాలేకపోయారని తెలిపారు. మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించినప్పటికీ కాలేజీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. హాజరు 65 శాతం ఉండాల్సి ఉండగా, 49.33 శాతమే ఉందంటూ కాలేజీ సర్క్యులర్ జారీ చేసిందని కోర్టుకు వివరించారు.  వాదనలను విన్న హైకోర్టు.. కాలేజీ జారీ చేసిన సర్క్యులర్‌‌ను రద్దు చేసింది. అనారోగ్యం కారణంగా హాజరు తగ్గిన విద్యార్థుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని ఆదేశించింది.