దివ్యాంగ క్రికెటర్లను.. హెచ్‌‌సీఏ ప్రోత్సహించాలి : వివేక్ వెంకటస్వామి

దివ్యాంగ క్రికెటర్లను.. హెచ్‌‌సీఏ ప్రోత్సహించాలి :  వివేక్ వెంకటస్వామి

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: దివ్యాంగ క్రికెటర్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ) ప్రోత్సహించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కోరారు. అంధ క్రికెటర్లకు సాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌‌చంద్‌‌ జయంతిని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలను శనివారం బ్లైండ్ అసోసియేషన్ ఆఫ్ క్రికెట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించారు.

 ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. బ్లైండ్ క్రికెటర్లు అనేక క్రికెట్ పోటీల్లో గెలిచి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. బ్లైండ్ క్రికెటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. క్రీడాకారులకు కావాల్సిన సాయాన్ని కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తామని ప్రకటించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) చైర్మన్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ.. బ్లైండ్ క్రికెటర్ల సమస్యలు పరిష్కరించేందుకు శాట్స్ కృషి చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో పారా ఒలింపిక్స్ నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 

దేశంలో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని.. అప్పుడే గ్రామీణ క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుందన్నారు. తర్వాత వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఆంజనేయులు గౌడ్‌‌ తదితరులు కలిసి క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో బ్లైండ్ అసోసియేషన్ ఆఫ్ క్రికెట్ ప్రతినిధి చిక్కా హరీశ్, భాను శిరీష, శ్రీధర్, అనిల్ రెడ్డి, ఉమామహేశ్వర తదితరులు పాల్గొన్నారు.