మార్కెట్‌కు హెచ్‌డీఎఫ్‌సీ దెబ్బ..6 శాతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు డౌన్

మార్కెట్‌కు హెచ్‌డీఎఫ్‌సీ దెబ్బ..6 శాతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు డౌన్

ముంబై: మార్కెట్ లాభాలకు బ్రేక్ పడింది. ఇండెక్స్ హెవీ వెయిట్‌‌‌‌ షేర్లు హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌, హెచ్‌‌డీఎఫ్‌‌సీ పతనంతో శుక్రవారం బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు  ఒక శాతం మేర నష్టపోయాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌, మెటల్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో సెన్సెక్స్ శుక్రవారం 695 పాయింట్లు (1.13 శాతం)  తగ్గి  61,054 వద్ద ముగిసింది. నిఫ్టీ 187 పాయింట్లు నష్టపోయి 18,069 వద్ద సెటిలయ్యింది. బ్యాంక్ నిఫ్టీ 1,024 పాయింట్లు పతనమై 42,661 వద్ద క్లోజయ్యింది. ఇన్వెస్టర్ల సంపద  రూ.1.43 లక్షల కోట్లు తగ్గింది. హెచ్‌‌డీఎఫ్‌‌సీ, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ విలీన సంస్థకు ఎంఎస్‌‌సీఐ ఇండెక్స్‌‌లో  పెద్దగా ఇన్‌‌ఫ్లోస్ రావని, ఇంకా 150–200 మిలియన్ డాలర్ల విలువైన ఇన్వెస్ట్‌‌మెంట్లు బయటకు వెళ్లిపోతాయని మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్‌‌ ఇంటర్నేషనల్‌‌  ప్రకటించింది. దీంతో  ఎఫ్‌‌ఐఐల అవుట్‌‌ ఫ్లో భారీగా ఉంటుందనే అంచనాలతో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌, హెచ్‌‌డీఎఫ్‌‌సీ షేర్లను ఇన్వెస్టర్లు శుక్రవారం పెద్ద మొత్తంలో అమ్మేశారు. ఈ రెండు షేర్లు 6 శాతం చొప్పున పతనమయ్యాయి.  వీటితో పాటు ఇండస్‌‌ఇండ్ బ్యాంక్‌‌, టాటా స్టీల్‌‌, కోటక్ బ్యాంక్‌‌, బజాజ్‌‌ ఫిన్సర్వ్, ఎస్‌‌బీఐ షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. మరోవైపు అల్ట్రాటెక్‌‌ సిమెంట్‌‌, మారుతి, నెస్లే, ఐటీసీ, ఎల్‌‌ అండ్ టీ, టైటాన్ షేర్లు మార్కెట్ పతనాన్ని కొంత మేర ఆపగలిగాయి. ఇవి శుక్రవారం లాభాల్లో కదిలాయి. క్యూ4 రిజల్ట్స్‌‌ మెరుగ్గా ఉన్నప్పటికీ ఫెడరల్ బ్యాంక్ షేర్లు 8 శాతం  పడ్డాయి. మణప్పురం ఫైనాన్స్ ప్రమోటర్ ఆస్తులను  ఈడీ అటాచ్ చేయడంతో ఈ కంపెనీ షేర్లు 11 శాతం క్రాష్ అయ్యాయి. సెక్టార్ల పరంగా చూస్తే, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్‌‌ 2.82 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌ 2.34 శాతం మేర పతనమయ్యాయి. నిఫ్టీ మెటల్‌‌, ఐటీ ఇండెక్స్‌‌లు కూడా నష్టాల్లో ముగిశాయి. బ్రాడ్ మార్కెట్ చూస్తే, నిఫ్టీ మిడ్‌‌క్యాప్‌‌100, స్మాల్‌‌క్యాప్‌‌ 50 ఇండెక్స్‌‌లు 0.80 శాతం వరకు తగ్గాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 81.80 వద్ద సెటిలయ్యింది. యూఎస్ జాబ్స్ డేటా వెలువడే ముందు గ్లోబల్ మార్కెట్‌‌లు శుక్రవారం సెషన్‌‌లో పాజిటివ్‌‌గా కదిలాయి. చైనా మార్కెట్‌‌ పడగా, సౌత్ కొరియా, జపాన్ మార్కెట్‌‌లు పాజిటివ్‌‌గా కదిలాయి.  లండన్‌‌, ఫ్రాంక్‌‌ఫర్ట్‌‌,  జర్మనీ మార్కెట్‌‌లు లాభాల్లో ట్రేడయ్యాయి. కాగా, యూఎస్  కిందటి నెలలో 2.53 లక్షల కొత్త జాబ్స్‌‌లను క్రియేట్ చేసింది. మరోవైపు దేశ ఫారెక్స్ నిల్వలు పెరుగుతున్నాయి. కిందటి నెల 28 తో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వ్‌‌లు  4.53 బిలియన్ డాలర్లు పెరిగి 588.78 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకు ముందు వారంలో ఫారెక్స్ నిల్వలు 2.16 బిలియన్ డాలర్లు పడి 584.24  బిలియన్ డాలర్లకు తగ్గాయి. 

ఎనలిస్టులు ఏమంటున్నారంటే?

1) హెచ్‌‌డీఎఫ్‌‌సీ ట్విన్స్ షేర్లు భారీగా  పడడంతో పాటు, ఇతర సెక్టార్ల షేర్లలో కూడా ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకోవడంతో బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు శుక్రవారం పతనమయ్యాయి  అని  మెహతా ఈక్విటీస్‌‌ ఎనలిస్ట్ ప్రశాంత్ తాప్సీ అన్నారు. యూఎస్ బ్యాంకింగ్ సంక్షోభ భయాలు, వాల్‌‌స్ట్రీట్ నెగెటివ్‌‌లో కదలడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌‌ను దెబ్బతీశాయని  వివరించారు.  నిఫ్టీకి 18,300 దగ్గర రెసిస్టెన్స్‌‌, 17,971 వద్ద సపోర్ట్ ఉందని వెల్లడించారు.

2)  మార్కెట్‌‌లో బుల్స్‌‌ ఆధిపత్యానికి బ్రేక్ పడిందని, ప్రస్తుతం ఇండికేటర్లు కన్సాలిడేషన్  ఫేజ్‌‌ను చూపుతున్నాయని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు.  నిఫ్టీకి 17,850 వద్ద స్ట్రాంగ్  సపోర్ట్ ఉందని,  ఈ లెవెల్‌‌ వరకు పడితే ఫ్రెష్ బయ్యింగ్ వస్తుందని అంచనావేశారు. బ్యాంకింగ్‌‌, ఫైనాన్షియల్స్‌‌ షేర్ల ర్యాలీకి బ్రేక్ పడుతుందని, మిగిలిన సెక్టార్ల షేర్లపై ఫోకస్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 

3)     వీక్లి చార్ట్‌‌లో నిఫ్టీ బుల్లిష్‌‌గా కనిపిస్తోందని,  అప్‌‌ట్రెండ్ కొనసాగుతుందని సామ్కో సెక్యూరిటీస్‌‌ ఎనలిస్ట్ రోహన్ పాటిల్ అన్నారు. మార్కెట్ పడినప్పుడు  కొనుగోలు చేయడానికి తాజా కరెక్షన్‌‌ను వాడుకోవాలని సలహాయిచ్చారు. వీక్లీ టైమ్‌‌ ఫ్రేమ్‌‌లో నిఫ్టీ బుల్లిష్‌‌గా ఉందని, మార్కెట్‌‌ పడినప్పుడు షేర్లను కొనుక్కోవడం లాభాన్నిస్తుందని అంచనా వేశారు. నిఫ్టీకి 17,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని, 18,350–18,400 వద్ద రెసిస్టెన్స్ ఉందని పేర్కొన్నారు.