- పూర్తి సంవత్సరానికి రూ.64 వేల కోట్ల లాభం
- రూ.19.5 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని ప్రపోజల్
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో రూ.16,512 కోట్ల నికరలాభం వచ్చింది. ఈ ప్రైవేట్ లెండర్‌కు ఈసారి రూ.17,315 కోట్ల లాభం వస్తుందన్న ఎనలిస్టుల అంచనాల కంటే ఈ మొత్తం తక్కువే! అయితే అంతకుముందు క్వార్టర్లో ప్రకటించిన లాభం రూ.16,373 కోట్ల రూపాయల కంటే మాత్రం ఎక్కువగా ఉంది. తాజా క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ.47,240 కోట్లు వచ్చింది.
కేటాయింపులు, కంటెంజెన్సీల కోసం రూ.13,510 కోట్లు పక్కన పెట్టింది. డిసెంబరు క్వార్టర్లో ఉన్న మొత్తం రూ.4,217 కోట్లతో పోలిస్తే వీటి కేటాయింపులు భారీగా పెరిగాయి. మార్చి క్వార్టర్ కేటాయింపుల్లో రూ.10,900 కోట్ల ఫ్లోటింగ్ కేటాయింపులు ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం -( సంపాదించిన, చెల్లించిన వడ్డీ మధ్య తేడా) - మునుపటి క్వార్టర్ నుంచి 2.1 శాతం పెరిగి రూ.29,080 కోట్లకు చేరింది. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ మొత్తం ఆస్తులపై 3.44శాతం ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల రుణాలు ఇటీవలి క్వార్టర్లో వార్షికంగా 1.6శాతం వృద్ధి చెంది 25.08 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.
ఇవి మునుపటి క్వార్టర్‌తో పోలిస్తే పెద్దగా పెరగలేదు. డిపాజిట్లు 7.5శాతం పెరిగి 23.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) నిష్పత్తి 1.26 శాతం నుంచి 1.24శాతానికి తగ్గింది. శుక్రవారం ఫలితాలకు ముందు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2.5శాతం లాభంతో ముగిశాయి. ఇదిలా ఉంటే సంస్థకు, పూర్తి సంవత్సరానికి రూ.64 వేల కోట్ల లాభం వచ్చింది. గత జులైలో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హోమ్‌లోన్ విభాగం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనమయింది. దీంతో గత ఏడాది క్వార్టర్లీ రిజల్ట్స్‌ను పోల్చడం లేదని బ్యాంక్ వివరణ ఇచ్చింది. ఈ ఏడాదికి రూపాయి ముఖవిలువ కలిగిన ప్రతి షేర్‌కు రూ.19.5 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని బ్యాంక్బోర్డ్ ప్రతిపాదించింది.
