టీచర్ల సమస్యల పరిష్కారానికి పోరాడాలి: పాతూరి సుధాకర్ రెడ్డి

టీచర్ల సమస్యల పరిష్కారానికి పోరాడాలి: పాతూరి సుధాకర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సర్కారు టీచర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని మాజీ చీఫ్​విప్ పాతూరి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. జీతాలు,  బిల్లులకు అడుక్కునే పరిస్థితి దాపురించడం బాధాకరమని ఆయన అన్నారు. బదిలీలు, ప్రమోషన్ల కోసం టీచర్లు సమైక్య పోరాటం చేయాలని ఆయన కోరారు. గురువారం హైదరాబాద్​లో  పీఆర్టీయూటీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి చీఫ్ గెస్టులుగా పాతూరి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి  జనార్దన్ రెడ్డి  హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.చెన్నయ్య, సుంకరి భిక్షంగౌడ్ మాట్లాడుతూ టీచర్ల బదిలీల అంశం మాత్రమే కోర్టు పరిధిలో ఉందన్నారు. 

కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రమోషన్లకు ప్రత్యేక షెడ్యూల్ రిలీజ్ చేయాలని కోరారు.  2003 డీఎస్సీ టీచర్ల రిక్రూట్మెంట్ సీపీఎస్ కంటే ముందే జరిగిందని,  కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వెంటనే ఆ టీచర్లందరికీ పాత పింఛన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.  సమస్యలు పరిష్కరించకుంటే త్వరలోనే పెద్ద ఎత్తున పోరాడతామని హెచ్చరించారు. సమావేశంలో  పీఆర్టీయూటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు పర్వతి సత్యనారాయణ, ట్రెజరర్ చంద్రశేఖర్​ రావు, రాష్ట్ర నాయకులు వెంకట్ రెడ్డి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.