అమెరికాలో మెజారిటీ ప్రజలు కోరుకున్నా ప్రెసిడెంట్ కాలేరా?

అమెరికాలో మెజారిటీ ప్రజలు కోరుకున్నా ప్రెసిడెంట్ కాలేరా?
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ సభ్యులే కీలకం

అగ్రరాజ్యం అమెరికాలో జరిగే ప్రతి మార్పు ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపుతుంటుంది. ప్రపంచానికి పెద్దన్నగా చలామణి అవుతున్న ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగబోతున్నాయి. అధ్యక్షుడిగా అమెరికా ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారన్న దానిపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.  ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ లీడర్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. గెలుపు నాదంటే నాదేనని ఇద్దరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రొసీజర్ చూస్తే ప్రజల మద్దతు బలంగా ఉన్నా ప్రెసిడెంట్ అయిపోవడం అంత ఈజీ కాదన్నది ఎక్స్​పర్ట్స్ మాట. దీనికి గత ఎన్నికల్లే ఉదాహరణగా చెబుతున్నారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కన్నా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు 28 లక్షల మంది ప్రజల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కానీ ఎలక్టోరల్ కాలేజ్ లో ఎక్కువ సీట్లు ట్రంప్ పార్టీ గెలవడంతో ఆయనే ప్రెసిడెంట్ అయ్యారు.

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటి అమెరికా. ప్రపంచానికే పెద్దన్న. ఆ దేశానికి అధ్యక్షుడయ్యే వ్యక్తి తీసుకునే నిర్ణయాలపై ప్రపంచం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంతటి పవర్​ఫుల్ పదవిలోకి వచ్చే వ్యక్తి ఎన్నిక గురించి ఒక్క అమెరికన్లే కాదు.. చాలా దేశాల ప్రజలకు ఆసక్తి నెలకొని ఉంది. నవంబర్ 3న జరిగే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కీలక ఘట్టమైన పాపులర్ ఓటింగ్ డే.. అమెరికా ఓటర్లు తాము కోరుకునే అభ్యర్థికి మద్దతుగా ఓట్లు వేస్తారు. అయితే నేరుగా ఈ ఓట్లలో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్లు అధ్యక్షుడైపోవడం కుదరదు. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పరోక్ష విధానంలో ఉంటుంది. ప్రజలు తాము మద్దతిచ్చే పార్టీకి చెందిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యులకు ఓట్లు వేస్తారు. వీరిని ఎలక్టర్స్ అంటారు. రాష్ట్రాల వారీగా జనాభాను బట్టి ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల సంఖ్య ఉంటుంది. అలాగే ఈ సంఖ్య ఒక్కో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్)లోని ఉభయ సభల నుంచి ఎన్నికయ్యే సభ్యులకు సమానంగా ఉంటుంది. అత్యధికంగా కాలిఫోర్నియా స్టేట్ లో 55 మంది ఎటక్టర్స్ ఉన్నారు. దేశం మొత్తం మీద 538 మంది ఎలక్టర్స్ ఉన్నారు. వీరిలో సగానికి పైగా అంటే 270 మంది లేదా అంత కంటే ఎక్కువ మందిని ఏ పార్టీ గెలుచుకుంటే వారికే ప్రెసిడెంట్ పదవి.

వద్దన్న విధానం వల్లే హిల్లరీపై ట్రంప్ గెలుపు

ఓవరాల్ గా పాపులర్ ఓటింగ్ లో అత్యధిక మెజారిటీ వచ్చినా కూడా ఎలక్టోరల్ కాలేజీ సీట్లు తగ్గడంతో అధ్యక్ష పదవి దక్కించుకోలేక ఓటమిపాలైన సందర్భాలు గతంలో జరిగాయి. దీని వల్ల దేశం మొత్తం మీద ఎక్కువ మంది ప్రజలు కోరుకున్న వ్యక్తి కాకుండా మరొకరు అమెరికా ప్రెసిడెంట్ అవుతున్నారు. ఇది సరైన విధానం కాదని, రాజ్యాంగాన్ని సవరించి ఎలక్టోరల్ కాలేజ్ విధానాన్ని రద్దు చేయాలని గతంలో డిమాండ్లు వచ్చాయి. ఇలా డిమాండ్ చేసిన వారిలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకరు. 2012 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ పాపులర్ ఓట్ లో భారీ మెజారిటీ తెచ్చుకున్నారు. కానీ ఎలక్టోరల్ కాలేజీలో తక్కువ సీట్లు రావడంతో డెమోక్రటిక్ పార్టీ నేత ఒబామా చేతిలో ఓడిపోయారు. దీంతో ఈ విధానాన్ని రద్దు చేయాలని నాడు ట్రంప్ డిమాండ్ చేశారు. కానీ విచిత్రంగా 2016 ఎన్నికల్లో డెమోక్రాట్ లీడర్ హిల్లరీ క్లింటన్ పై విజయం సాధించడానికి అదే ఎలక్టోరల్ కాలేజ్ విధానమే ట్రంప్ కి సాయపడింది. ట్రంప్ కన్నా హిల్లరీకి దాదాపు 28 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ ఎలక్టోరల్ కాలేజ్ సీట్లు తక్కువ రావడంతో ఆమెకు అధ్యక్ష పదవి దక్కలేదు. దీంతో తాను వద్దన్న విధానం వల్లనే ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి దక్కించుకున్నట్లైంది. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్ విధానం వల్ల మెజారిటీ ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా పోతోందన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. గతంలో అమెరికాలో బానిసత్వం ఉన్న రోజుల్లో ఈ విధానం పెట్టారని మెక్ గిల్ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ జాసన్ ఒపాల్ అన్నారు. బానిసలు ఎక్కువగా ఉన్న సదరన్ స్టేట్స్ లో మెజారిటీ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం రాకూడదన్న ఆలోచనతో ఈ రకమైన నిర్ణయం జరిగిందన్నారు. అమెరికా ఎన్నికల వ్యవస్థ రూపకల్పనలో స్లేవరీ ఓనర్ల ప్రభావం ఉందని చెప్పారు. ప్రజల అభిప్రాయానికి అధ్యక్ష ఎన్నికకు మధ్య ఎలక్టోరల్ కాలేజ్ ఒక ఫిల్టర్ లాగా ఉపయోగపడేలా చేశారన్నారు. అయితే ఈ విధానాన్ని మార్చాలంటే రెండింట మూడొంతుల మెజారిటీతో పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. దీంతో ఇప్పటి వరకూ ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చాక ఆ రకమైన ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు.

టై అయితే?

పాపులర్ ఓటింగ్ ముగిసిన తర్వాత కొద్ది రోజులకు కౌంటింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత గెలిచిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యులకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు సర్టిఫికెట్ ఇస్తారు. పార్టీల వారీగా గెలిచిన వాళ్లంతా తమ రాష్ట్రాల్లోనే ప్రెసిడెంట్ అభ్యర్థికి వేట్లు వేస్తారు. వాటిని జనవరి 6న లెక్కించి గవర్నర్లు దేశ రాజధాని వాషింగ్టన్ లోని పార్లమెంట్ కు తెలియజేస్తారు. కనీసం 270 ఓట్లు వచ్చిన అభ్యర్థిని అమెరికా అధ్యక్షుడిగా ప్రకటిస్తారు.  జనవరి 20న అధ్యక్షుడి ప్రమాణ స్వీకరం జరుగుతుంది. అయితే ఎవరికీ సరైన మెజారిటీ రాకుండా టై అయితే ఓటింగ్ లో టాప్ – 3 అభ్యర్థుల్లో ఒకరిని అమెరికా పార్లమెంట్ లోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్) ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. ఈ సభలో ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్లే అధ్యక్ష పదవిని దక్కించుకుంటారు. గతంలో ఒకటి రెండు సార్లు మాత్రమే ఇలాంటి పరిస్థితి తలెత్తింది.