న్యూఢిల్లీ : ఫైనాన్షియల్ టెక్నాలజీల (ఫిన్‌టెక్) వాడకం ఇతర దేశాల కంటే మన దగ్గరే ఎక్కువగా ఉందని కేంద్ర ఆంట్రప్రెనార్, స్కిల్ డెవెలప్మెంట్, ఎలక్ట్రానిక్స్ & టెక్నాలజీ శాఖల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ముంబైలో మంగళవారం జరిగిన మనీకంట్రోల్ ఫిన్‌టెక్ కాన్క్లేవ్(ఐఎఫ్‌సీ)లో మాట్లాడుతూ భారతదేశంలోని ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్, దాని భవిష్యత్తు, అవకాశాల గురించి వివరించారు. త్వరలో రాబోతున్న డేటా ప్రొటెక్షన్చట్టం ఫిన్‌టెక్ బిజినెస్‌లకు అడ్డంకులు సృష్టించబోదని స్పష్టం చేశారు. ఇండియాలో 87 శాతం జనాభా ఫిన్‌టెక్ సేవలను ఉపయోగించుకుంటున్నారని, ప్రపంచ సగటు 67 శాతం మాత్రమేనని అన్నారు. ‘‘ఇండియా ఫిన్‌టెక్ సిస్టమ్ మిగతా దేశాలతో పోలిస్తే అత్యంత వేగంగా ఎదుగుతోంది.
మన ఇన్నోవేషన్లకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. 2025-–26 నాటికి ఇండియా ఎకానమీ ట్రిలియన్ డాలర్ల టార్గెట్‌ను చేరుకోవడంలో ఫిన్‌టెక్ రంగం కీలకం. భారతీయ యువతలో అద్భుతమైన సత్తా ఉంది. దానిని వాడుకోవాలి. మొత్తం ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ ఎకానమీ వాటా 2026 నాటికి 22 శాతానికి పెరుగుతుంది”అని ఆయన వివరించారు. ఫిన్‌టెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఫిన్‌టెక్‌లో ఏఐ వాడకం కచ్చితంగా పెరుగుతుందని, ఇంటర్నెట్ ఎకోసిస్టమ్‌లోని ఇతర భాగాలకూ మేలు చేస్తుందని రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఇండియా ఏఐ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.
ఫిన్‌టెక్‌ల కోసం ప్రత్యేక కమిటీ: ఆర్బీఐ
ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) సంస్థలను నియంత్రించడానికి ఆర్బీఐ ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి వెల్లడించారు. ఫిన్‌టెక్‌లలో ఇనోవేషన్లను తీసుకురావడం, కంట్రోల్ చేయడం ఎప్పుడూ ఒక సవాలేనని అన్నారు. "ఫిన్‌టెక్‌లు, పెద్ద టెక్‌ల ద్వారా వచ్చే నష్టాలపై రెగ్యులేటర్లు నిఘా ఉంచాలి. ఫిన్‌టెక్, స్టార్టప్‌లు, పెద్ద టెక్‌ల వల్ల వచ్చే ప్రమాదాలు వేర్వేరుగా ఉంటాయి. ఫిన్‌టెక్స్ లెండింగ్ ఎకోసిస్టమ్ కోసం మేం ఒక ఫ్రేమ్‌వర్క్ ను తీసుకొస్తున్నాం. ఈ విధానంలో అయినా కస్టమర్ భద్రత మాకు చాలా ముఖ్యం. అయితే డేటా సెక్యూరిటీ, బ్రీచెస్ విషయంలో ఫిన్‌టెక్‌లు చాలా జాగ్రత్తగా ఉండాలి”అని చౌదరి చెప్పారు.
డిజిటల్ రూపాయి గురించి మాట్లాడుతూ ప్రైవేట్ సెక్టార్‌కు మరిన్ని యూజ్ కేస్లు దొరికితే దీని వాడకం ఇంకా పెరుగుతుందని వివరించారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్కరెన్సీ (సీబీడీసీ)లో చేరాల్సిందిగా ప్రైవేట్సెక్టార్ను ఎంకరేజ్ చేస్తున్నామని చౌదరి ఈ సందర్భంగా వివరించారు. ఇదిలా ఉంటే యూపీఐ వల్ల ఫిన్‌టెక్ సంస్థలకు ఎంతో మేలు జరుగుతోందని ఈ సందర్భంగా ఎన్సీఐ సీఈఓ దిలీప్ అస్బే అన్నారు. యూపీఐ పూర్తి సత్తా ఇంకా బయటపడలేదని, ఇప్పుడున్న వాటితో పోలిస్తే యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్యను పది రెట్లు పెంచవచ్చని చెప్పారు.
