జగిత్యాలలో ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్

జగిత్యాలలో ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్

జగిత్యాల రూరల్, వెలుగు:  జగిత్యాల సబ్ డివిజనల్ ఎంపీడబ్ల్యూ(నాన్​బెయిలబుల్ ​వారంట్)​టీం ఇన్​చార్జీగా పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎస్. మనోహర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ పీఎస్ లో హెడ్ కానిస్టేబుల్ మనోహర్ ఎంపీడబ్ల్యూ టీం ఇన్​చార్జి. జగిత్యాలకు చెందిన బి. తిరుపతి నాలుగు నెలల క్రితం దుబాయ్​ వెళ్లాడు. గతంలో ఓ భూమి విషయంలో నమోదైన కేసులో హాజరు కాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్​ వారెంట్ ఇష్యూ చేసింది. 

ఈ వారెంట్​పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సహకరించేందుకు మనోహర్​ ..తిరుపతి నంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో తిరుపతి ఈ నెల 16న ఫోన్ పే ద్వారా మనోహర్​కు రూ. 5 వేలు చెల్లించాడు. మరో రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సరేనన్న తిరుపతి దుబాయి నుంచి ఏసీబీ డీజీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. తర్వాత తన మామ కటుకం తిరుపతికి రూ.5 వేలు పంపి జగిత్యాల రాజీవ్ గాంధీ చౌక్ వద్ద మనోహర్​కు ఇవ్వాలని కోరాడు. అతడు చెప్పినట్టే ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ తిరుపతి, ఏసీబీ సీఐ కృష్ణ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు.