
- రెండోసారి మీటింగ్ పెట్టుకున్న అసంతృప్తి లీడర్లు
- వేటు వేస్తామని హెచ్చరించిన సంజయ్
హైదరాబాద్, కరీంనగర్, వెలుగు: బీజేపీలో ముసలం పుట్టిందా? పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కు సొంత జిల్లా కరీంనగర్ నుంచే అసమ్మతి పెరుగుతున్నదా? అనే చర్చ సాగుతున్నది. నెల రోజుల కింద రహస్యంగా మీటింగ్పెట్టుకున్న అసమ్మతి నేతలు ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి కొందరు నేతలను పిలిచి మళ్లీ సీక్రెట్‌గా మీటింగ్ పెట్టుకోవటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంగళవారం కరీంనగర్‌లో బండి సంజయ్ ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. అదే టైమ్‌లో అదే జిల్లాకు చెందిన నేతల డైరెక్షన్లో హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పాత పది జిల్లాల పరిధి నుంచి ముఖ్యమైన నేతలు 10 మంది చొప్పున 100 మందితో రహస్య మీటింగ్ జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న సంజయ్ వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే నేతలను క్షమించే ప్రసక్తి లేదని.. వారిపై వేటు తప్పదని పదాధికారుల సమావేశంలో అన్నారు.
దశాబ్దాలుగా పనిచేస్తున్నా పట్టించుకోరా: అసమ్మతి లీడర్లు
బీజేపీ రాష్ట్ర శాఖ తీరు, బండి సంజయ్‌కు వ్యతిరేకంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పలువురు సీనియర్ నేతలు సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు అర్జున్‌రావు, పార్టీ కిసాన్ మోర్చా మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సుగుణాకర్‌రావు, హైదరాబాద్‌కు చెందిన నేత రాజారమణి, మరో సీనియర్ నేత రాములు పాల్గొన్నారు. ఎప్పట్నుంచో పనిచేస్తున్న తమను పట్టించుకోవడంలేదని వీరు మీటింగ్‌లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సంజయ్ ఒంటెత్తు పోకడలు పోతున్నారని మండిపడ్డారు. ప్రాణాలకు తెగించి, అంకిత భావంతో దశాబ్దాలుగా పార్టీ కోసం కృషి చేస్తున్నామని, కానీ నిన్నగాక మొన్న వేరే పార్టీ నుంచి వచ్చిన కొత్త నేతలకే ప్రయారిటీ ఇస్తున్నారని విమర్శించినట్లు సమాచారం. అసమ్మతి నేతలు సమావేశమవడం ఇదే ఫస్ట్‌టైమ్ కాదు. ఈ మధ్య కాలంలో వరుసగా సీక్రెట్ మీటింగ్‌లు పెడుతున్నారు. గతంలోనూ ఈ నేతలు రెండు, మూడు సార్లు కరీంనగర్‌లో మీటింగ్ పెట్టి తమన అసమ్మతి వ్యక్తం చేశారు.
కట్టు తప్పితే వేటు తప్పదు
బీజేపీ నాయకులకు సంజయ్ హెచ్చరిక
కరీంనగర్‌సిటీ, వెలుగు: ‘‘బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎంతటి సీనియర్ నాయకులైనా సరే.. పార్టీ సిద్దాంతాలు, విధానాలకు లోబడి పని చేయాల్సిందే. కట్టు తప్పితే ఎంతటి వారైనా సరే సహించే ప్రసక్తే లేదు.. వేటు తప్పదు” అంటూ బీజేపీ నాయకులను ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు. ఏ పార్టీలోనైనా కొందరు అసమ్మతి వాదులు ఉంటారని.. వారు పని చెయ్యరని, పని చేసేటోళ్ల మీద అక్కసు గక్కుతుంటారని మండిపడ్డారు. అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. మంగళవారం కరీంనగర్‌లో జరిగిన పదాధికారుల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టాడని విమర్శించారు. రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందని, ఇక దేశాన్ని బంగారు భారత్చేస్తానని పిట్టల దొర కబుర్లు చెబుతున్నాడని మండిపడ్డారు. ఇంట్లో పోరు భరించలేకనే, జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడని అన్నారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తూ, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఫైర్ అయ్యారు. మేడారానికి గవర్నర్ వెళ్తే మంత్రులు, అధికారులు స్వాగతం పలకకుండా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ఏడేండ్లలో రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. కాగా, ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన ఏబీవీపీ నాయకుడు రూపిరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి తల్లి రమాదేవి ఇటీవల చనిపోగా, కుటుంబసభ్యులను సంజయ్ పరామర్శించారు.