
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశ వ్యాప్తంగా కులగణనను ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘‘కులగణనపై హెడ్లైన్లు చెప్పారు సరే.. డెడ్లైన్ఎప్పుడు?’’ అని ఆయన ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. డెడ్లైన్లు లేకుండా హెడ్లైన్లు ఇవ్వడంలో ప్రధాని మోదీ మాస్టర్ అని విమర్శించారు.
పహల్గాం ఉగ్రదాడి ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్ర ప్రభుత్వం కులగణన అంశాన్ని తెరమీదికి తెచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం కులగణనకు అంగీకరించడం నైతిక, రాజకీయ ఓటమిని ప్రతిబింబిస్తున్నదని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మొదటి నుంచీ కులగణనను వ్యతిరేకించాయన్నారు. ప్రస్తుతం దేశం ముందున్న అతిపెద్ద సమస్య పహల్గాం దాడి అని, ఈ విషయంలో పాకిస్తాన్‌కు ఎలా సమాధానం చెప్పారు? బాధిత కుటుంబాలకు న్యాయం ఎలా చేస్తారో చెప్పాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.
కాలపరిమితి నిర్ణయించాలి..
కులగణన కోసం తగినన్ని నిధులు కేటాయించాలని, కాలపరిమితి నిర్ణయించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కులగణన కోసం ఆందోళనలు చేశాయని, ఇప్పుడు తమ లక్ష్యాన్ని సాధించినందుకు సంతోషంగా ఉన్నామన్నారు. గురువారం బెంగళూరులో ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘‘కులగణన కోసం రెండేండ్ల క్రితం ప్రధానికి లేఖ రాశాను. అప్పుడు అంగీకరించలేదు. ఇప్పుడు కులగణన చేస్తమని ప్రకటించారు. ఇది మంచి పరిణామం. మేం పూర్తిగా సహకరిస్తాం”అని ఖర్గే చెప్పారు.