61ఏండ్ల రిటైర్మెంట్ నాకొద్దు..యూత్‌కు కొలువులివ్వండి... హెడ్మాస్టర్ సార్ మాట

61ఏండ్ల రిటైర్మెంట్ నాకొద్దు..యూత్‌కు కొలువులివ్వండి... హెడ్మాస్టర్ సార్ మాట

జగిత్యాల: రిటైర్మెంట్ పెంపు  తనకు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ ఉపాధ్యాయుడు తెలియజేసిన నిరసన.. బహిరంగ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాలకు చెందిన హెడ్ మాస్టర్ ఏనుగు మల్లారెడ్డి.. తనకు రిటైర్మెంట్ 61 ఏండ్ల పెంపు వద్దంటూ ఓ ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన కోసం రెండు దశబ్దాలుగా సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విద్యార్థుల వీరోచిత పోరాటం... యువకుల బలిదానం.. సబ్బండ వర్గాల సమిష్టి పోరాటాల పలితంగా  తెలంగాణ రాష్ట్రం సిద్దించిందన్నారు మల్లారెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ 
అప్రజాస్వామిక నిర్ణయాలు ఎన్నో తీసుకుంటున్నారని ఆయన తూర్పారబట్టారు .  ఉద్యోగస్థులకు  పదవీ విరమణ వయస్సు పెంపును 61 సంవత్సరాలకు పెంచడం.. నిరుద్యోగ యువకులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారాయన. ఈ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని.. తనకు రిటైర్మెంట్ వయస్సు 61 ఏండ్లు అక్కర్లేదని..  వెంటనే ప్రభుత్వం కూడా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పునరాలోచించి ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని, నిరుద్యోగ యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏనుగు మల్లారెడ్డి కోరారు.

ఒకే ఒక్కడు..
ఫ్లెక్సీలు లేవు.. ప్ల కార్డులు అస్సల్లేవు.. కనీసం నినాదాలు కూడా వినిపించలేదు. మరి ఇదేంటి.. ఇది కూడా నిరసన.. ఇలా కూడా తెలియజేయొచ్చా.. అంటే.. అవును అంటూ నిజంగా చేసి చూపించాడీ  పెద్దాయన. కేవలం నల్ల బ్యాడ్జీ ధరించి విధులు నిర్వహిస్తూ తనను కలసిన వారందరికీ తాన బ్లాక్ బ్యాడ్జీ ఎందుకు పెట్టుకున్నది క్లుప్తంగా చెబుతూ వస్తున్నాడు. పూర్వ విద్యార్థులతోపాటు.. తనకు పరిచయం ఉన్న వారందరికీ తానొక్కడినే అయినా.. తన నిరసన.. అసంతృప్తి ప్రభుత్వానికి తెలియజేసేందుకే నల్లబ్యాడ్జీలు ధరించానని వివరిస్తున్నాడు. తమ కోసం హెడ్మాస్టర్ చేస్తున్న నిరసనను యూత్ స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మందీ మార్బలం, కార్యకర్తల హంగామా.. ఊరేగింపులు.. ర్యాలీలు.. ప్లకార్డులు.. జెండాలు.. ఫ్లెక్సీలు..  ఇవేవీ లేకుండా ఈ హెడ్మాస్టర్ చేస్తున్న నిరసన స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన జగిత్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రిటైర్మెంట్ వయసు 58 నుండి 61 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని.. యూత్ కు అవకాశం కల్పించాలని పునరుద్ఘాటించారు. సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నల్ల బాడ్జీ ధరించి స్కూల్ లో నిరసన తెలిపానన్నారు. వచ్చే ఏడాది  2022 మార్చి31 తో తన వయస్సు 58 పూర్తి అవుతుందని, పాత పద్ధతి ప్రకారం 58ఏండ్ల వయస్సులోనే తాను ఉద్యోగ విరమణ చేస్తానన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయం పాలన కోసం రెండు దశాబ్దాలుగా సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో యువత, విద్యావంతులు క్రియాశీలంగా పోరాడారని ఆయన గుర్తు చేశారు. యువకుల బలిదానంతో  తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, దాని ఫలితాలు వారికి దక్కాలన్నారు.