ప్రైమరీ స్కూళ్లకు హెడ్మాస్టర్ పోస్టులు

ప్రైమరీ స్కూళ్లకు హెడ్మాస్టర్  పోస్టులు

హైదరాబాద్, వెలుగు: సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)లకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. లో ఫీమెయిల్ లిట్రసీ (ఎల్ఎఫ్ఎల్) హెచ్ఎం పోస్టులను పదివేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో చాలామంది ఎస్జీటీలు.. ఎస్జీటీలుగానే రిటైర్ అవుతుండగా, ప్రభుత్వం చేసిన ప్రకటనతో వారికి కొంత ఊరట లభించే అవకాశముంది. అయితే ఇప్పటివరకు మరో పదివేల ప్రైమరీ స్కూళ్లకు హెచ్ఎం పోస్టులను మంజూరు చేస్తారని భావించిన ఎస్జీటీలకు కొంత నిరాశే మిగిలింది. స్టేట్​లో 18,240 ప్రైమరీ స్కూళ్లుండగా,  4,207 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులున్నాయి. వీటిలో 2,386 మంది పనిచేస్తుండగా, మరో 1,821 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు కేవలం డీఈడీ చేసిన వారికి మాత్రమే ప్రమోషన్ ఇస్తున్నారు. వీటికి తోడుగా ప్రభుత్వం తాజాగా మరో 5,793 కొత్త పోస్టులను మంజూరు చేయనున్నది. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ప్రతి స్కూల్​కు హెచ్​ఎం స్కూల్​ మంజూరు చేయాలని ఎస్జీటీలు కోరుతున్నారు. అయితే ఇప్పుడు మంజూరు చేసిన పీఎస్​హెచ్ఎం పోస్టులను బీఈడీ, డీఈడీ తేడా లేకుండా సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని ఎస్​జీటీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ఖమ్రుద్దీన్ ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే బీఈడీ, డీఈడీ టీచర్ల మధ్య గొడవలు జరిగే అవకాశముందని తెలిపారు. ప్రైమరీ స్కూళ్లలో పదివేల పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయడం పట్ల ఎస్జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిపాల్​రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 
టీచర్ల ప్రమోషన్లపై కసరత్తు ... 
ఉమ్మడి జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన మేనేజ్మెంట్ల వారిగా ప్రమోషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్​చేసిన ప్రకటనతో విద్యాశాఖ ఆ మేరకు రెడీ అయింది. ఇప్పటికే ప్రమోషన్ల సీనియార్టీ లిస్టులు, ఖాళీల వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. దీని ప్రకారం స్కూల్​ఎడ్యుకేషన్​లో 7,868 మందికి, మోడల్ స్కూళ్లలో 336 మందికి ప్రమోషన్లు ఇవ్వాలని రిపోర్టు ఇచ్చింది. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 6,237 మందికి, స్కూల్​ అసిస్టెంట్ల నుంచి హెచ్ఎంలుగా1,631 మందికి, మోడల్ స్కూళ్లలో టీజీటీ నుంచి పీజీటీకి 276 మందికి, పీజీటీ నుంచి ప్రిన్సిపాల్స్ గా 60 మందికి ప్రమోషన్లు ఇవ్వనున్నారు. అయితే వీరికి డీఈఓ ద్వారా కాకుండా ఆర్జేడీ పేర్లతో ప్రమోషన్లు ఇచ్చే అవకాశముంది.