డెమోక్రసీకి భారత్ తల్లిలాంటిది : ఐటీపీఓ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవంలో మోదీ

డెమోక్రసీకి భారత్ తల్లిలాంటిది : ఐటీపీఓ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవంలో మోదీ

ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (IECC)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ‘జీ-20’ శిఖరాగ్ర సదస్సు (G-20 Summit)కు వేదిక కానున్న ఈ కన్వెన్షన్‌ సెంటర్‌కు ‘భారత్‌ మండపం’ (Bharat Mandapam)గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమన్నారు ప్రధాని మోదీ. డెమోక్రసీకి భారత్ తల్లిలాంటిదన్నారు. ఈ భవనం మన సామర్థ్యానికి ప్రతీకలాంటిదన్నారు. భారత్ మండపం జీ20 ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తుందని చెప్పారు. భారత్ ఎదుగుదలను ప్రపంచం మొత్తం చూడనుందన్నారు. ప్రతి వ్యవస్థలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. 

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందని.. ఆ సమయంలో భారత్‌ ప్రపంచంలోనే మూడో ఆర్థికశక్తి ఘనతను సాధిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో భారత్‌ ఎన్నో విజయాలు సాధిస్తోందన్నారు. భారత్‌ అభివృద్ధి ప్రయాణం ఆగదన్నారు. ‘ప్రజాస్వామ్యానికి భారత్‌ మాతృమూర్తి అనే విషయాన్ని యావత్‌ ప్రపంచం అంగీకరిస్తోంది. కొత్తగా నిర్మించిన ‘భారత్‌ మండపం’ మన దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెబుతుంది. సమావేశాల టూరిజానికి ‘భారత్‌ మండపం’ ఊతమిస్తుంది. దేశంలో అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కొన్ని వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో భారత్‌ ఎన్నో విజయాలు సాధిస్తోంది. ఉన్నతంగా ఆలోచించండి, గొప్ప కలలను కనండి, అందుకు తగినట్లుగా కార్యచరణను ఆచరించండి’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఏ ఒక్క భారతీయుడు కూడా పార్లమెంటు నూతన భవనాన్ని గొప్పగా చెప్పుకోకుండా ఉండలేరని మోదీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం త్వరలోనే ఢిల్లీలో ఏర్పాటు చేస్తామన్నారు. 2014లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రయాణికుల సంఖ్య 5 కోట్లు ఉండగా.. ఇప్పుడది 7.5కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. 

భారత్‌ అధ్యక్షతన జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ‘జీ-20’ శిఖరాగ్ర సదస్సు (G-20 Summit)కు ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (IECC) వేదిక కాబోతోంది. ఈ వేదికకు భారత్‌ మండపంగా నామకరణం చేశారు. ఢిల్లీలో 123 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.2,700 కోట్ల ఖర్చుతో ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. సెప్టెంబర్‌లో జరిగే జీ20 సదస్సుకు వివిధ దేశాధినేతలతో పాటు భారీ సంఖ్యలో విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. జీ20 సదస్సు ప్రారంభ వేడుకకు కేంద్ర కేబినెట్‌ మంత్రులతో పాటు పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన దాదాపు 3వేల మందికి పైగా అతిథిలు హాజరయ్యే అవకాశం ఉంది.