చిరునవ్వుతో జ‌యిద్దాం.. డాక్ట‌ర్స్ ఫొటో వైర‌ల్

చిరునవ్వుతో జ‌యిద్దాం.. డాక్ట‌ర్స్ ఫొటో వైర‌ల్

ఏదైనా క‌ష్టం రాగానే నిరాశ‌తో కుంగిపోతే.. అది మ‌న‌ల్ని మ‌రింత బ‌ల‌హీనంగా త‌యారు చేస్తుంది. కానీ చిరున‌వ్వుతో ధైర్యంగా ఎదుర్కొంటే ఎంత పెద్ద క‌ష్ట‌మైనా చిన్న‌దిగా క‌నిపిస్తుంది. సుల‌భంగా దాని నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. ఇప్పుడు ప్ర‌పంచాన్ని క‌ల్లోలంలోకి నెట్టేసిన క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన పేషెంట్ల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్లు ఇదే సూత్రాన్ని చెబుతూ ధైర్యం నూరిపోస్తున్నారు. ముఖంలో చిరున‌వ్వు క‌నిపించ‌కుండా పీపీఈ (ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్టివ్ ఎక్యూప్మెంట్) అడ్డుగా మార‌డంతో ఓ వినూత్న ఆలోచ‌న చేశారు. తాము నిండుగా న‌వ్వుతున్న ఫొటోను పీపీఈ సూట్ పై అతికించుకుని పేషెంట్ల‌కు ట్రీట్మెంట్ చేస్తున్నారు.

తిరిగి చిరున‌వ్వుతో పేషెంట్ల స్పంద‌న‌..

అమెరికాలోని శాన్ డిగో క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స చేస్తున్న రెస్పిరేట‌రీ థెర‌పిస్ట్ డాక్ట‌ర్ రోబెర్టో మార్టినెజ్ కు ఈ స్మైలీ ట్రీట్మెంట్ ఐడియా వ‌చ్చింది. తాను ప‌ని చేస్తున్న స్క్రిప్స్ మెర్కీ హాస్పిట‌ల్ లో క‌రోనా బాధితులు దిగాలుగా ఉండ‌డం గ‌మ‌నించి.. వారికి ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశానని చెబుతున్నారు. పీపీఈ సూట్ లో త‌న ఫేస్ స‌రిగా క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌న స్మైలీ ఫొటో ల్యామినేష‌న్ చేయించి.. సూట్ పైన అంటించుకున్న‌ట్లు చెప్పారు డాక్ట‌ర్ మార్టినెజ్. ఇలా డ్యూటీకి వెళ్ల‌డం మొద‌లుపెట్టిన త‌ర్వాత‌ పేషెంట్లు చాలా కంఫ‌ర్ట‌బుల్ గా స్పందిస్తున్నార‌ని అన్నారు. నాలుగు రోజుల క్రితం ఇలా ఆస్పత్రికి వెళ్లిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌డంతో అది వైర‌ల్ గా మారింది. తను న‌వ్వుతున్న ఫొటోతో డ్యూటీకి వెళ్ల‌డం స్టార్ట చేశాక పేషెంట్లు కూడా త‌న‌ను చూడ‌గానే చిరున‌వ్వుతో స్పందిస్తున్నారంటూ ఆయ‌న పెట్టిన పోస్టుకు 23 వేల మందికి పైగా లైక్ చేశారు. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్యూ, హీరో, మీ పాజిటివ్ ఐడియా సూప‌ర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు.