ప్రైవేట్​ దవాఖానాలపై నియంత్రణేది?

ప్రైవేట్​ దవాఖానాలపై నియంత్రణేది?
  • అనుమతుల్లేని ఇన్​ఫెర్టిలిటీ సెంటర్లు 
  • ఖమ్మంలో జోరుగా లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు!
  • వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి పేషెంట్ల రాక
  • ఫిర్యాదులు వస్తే తప్ప తనిఖీలు చేయని ఆఫీసర్లు!

ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ నియంత్రణ కోల్పోయినట్టుగా కనిపిస్తోంది. ఎలాంటి అనుమతుల్లేకుండానే సంవత్సరాల తరబడి ఆసుపత్రులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదు. పర్మిషన్లు లేని ఇన్​ ఫెర్టిలిటీ సెంటర్లు, అబార్షన్లు చేసే క్లీనిక్​లు, డాక్టర్లు లేకుండానే నడిచే ఆస్పత్రులు.. ఇలా కొన్ని రోజులుగా వరుసగా బయటపడుతున్నాయి. పత్రికల్లో వార్తలు, ఫిర్యాదులు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయంలో ప్రైవేట్​ హాస్పిటళ్లపై నిఘా కరువైందనే ఆరోపణలున్నాయి.

స్కానింగ్ సెంటర్లు, డయాగ్నస్టిక్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం కామన్​ గా మారిందనే కంప్లైంట్స్​ ఉన్నాయి. తాజాగా ఒకే కాంప్లెక్స్​ లో నిర్వహిస్తున్న మూడు ఆస్పత్రులను డీఎంహెచ్​వో మాలతి సీజ్​ చేశారు. టాస్క్​ ఫోర్స్​ పోలీసులు డెకాయ్​ ఆపరేషన్​ నిర్వహించి, ఆదర్శ ఆస్పత్రిలో అబార్షన్లు నిర్వహిస్తున్న విషయాన్ని నిర్ధారించుకొని ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి సీజ్​ చేశారు. అదే బిల్డింగ్ లో నిర్వహిస్తున్న పాజిటివ్​ హోమియోపతి, తులసి డెంటల్ ఆస్పత్రికి అనుమతులు లేవని మూసివేయించారు. 

ఫెర్టిలిటీ ​సెంటర్లకు నోటీసులు!

రెండు వారాల కింద ఖమ్మంలోని ఇన్​ ఫెర్టిలిటీ సెంటర్లపైనా ఉన్నతాధికారులు దాడులు చేశారు. ఖమ్మం, వరంగల్​, కరీంనగర్​ జిల్లాల్లో అనుమతి లేకుండా ఇన్​ ఫెర్టిలిటీ సెంటర్లను నిర్వహిస్తున్నారని, రూల్స్​ కు విరుద్ధంగా చికిత్స చేస్తున్నారని ఆరోగ్య శాఖ కమిషనర్​ ఆర్వీ కర్ణన్​ కు ఫిర్యాదు రావడంతో ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. ఖమ్మంలో 10 ఇన్​ ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు చేయగా, వాటిలో తొమ్మిది సెంటర్లు రూల్స్​ కు విరుద్ధంగా ఉన్నాయని అధికారులు తేల్చారు.

అందులో ఏడు సెంటర్లకు ఆఫీసర్లు షోకాజ్​నోటీసులు జారీ చేశారు. వైరా రోడ్డులోని శ్రీ ఫెర్టిలిటీ సెంటర్​ లో చికిత్స అందించకుండా, అక్కడికి వచ్చిన పేషెంట్లను హైదరాబాద్​ లోని మరో ఆస్పత్రికి పంపిస్తున్నట్టు గుర్తించారు. భారతి సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిలో అనుమతుల్లేకుండా ఐవీఎఫ్​ చికిత్స అందిస్తున్నారని గుర్తించారు. ఈ రెండు ఆస్పత్రులను సీజ్​ చేశారు. 

కొన్ని ఆసుపత్రుల జోలికి వెళ్లట్లే!

ఖమ్మం నగరంలో పదుల సంఖ్యలో సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రులుండగా, 300కు పైగా చిన్నా, పెద్ద ఆస్పత్రులున్నాయి. వీటిలో చాలావరకు కన్సల్టెంట్ డాక్టర్లను తీసుకువచ్చి, మేనేజ్​ మెంట్లు నడిపిస్తున్న ఆస్పత్రులున్నాయి. వైద్యారోగ్య శాఖ నిబంధనలను పాటించకపోవడం, ఆస్పత్రుల్లో ఖర్చులకు సంబంధించిన రేట్​ చార్ట్ ప్రదర్శించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు అబార్షన్లు చేయడం, ప్రత్యేక డాక్టర్లు లేకున్నా సీనియర్​ నర్సులతోనే అబార్షన్లు చేయించడంపై ఫిర్యాదులు వస్తేనే తప్పించి ఆఫీసర్లు కొన్ని ఆసుపత్రుల జోలికి వెళ్లట్లేదని, దీనికి మామూళ్లే  కారణమనే ఆరోపణలున్నాయి. 

ఒక్కో అబార్షన్​కు రూ.30 వేల వరకు వసూళ్లు 

ఇటీవల సీజ్​ చేసిన ఆస్పత్రి కాకుండా మరో నాలుగు ఆస్పత్రుల్లోనూ రెగ్యులర్​ గా అబార్షన్లు జరుగుతాయని, నల్గొండ, వరంగల్​ జిల్లాల నుంచి కూడా ఆర్​ఎంపీలు ఇక్కడికి గర్భిణులను తీసుకువస్తారని తెలుస్తోంది. ఒక్కో అబార్షన్​ కు రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న మరిన్ని భాగోతాలు బయటపడుతాయని అంటున్నారు. 

సుగుణ హాస్పిటల్ సీజ్ 

  • అబార్షన్లు చేస్తుండగా పట్టుకున్న డీఎంహెచ్​వో 

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని బోనకల్ క్రాస్ రోడ్డు చర్చి కాంపౌండ్ కు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న సుగుణ హాస్పిటల్ ను అధికారులు సీజ్​ చేశారు. గురువారం రాత్రి హాస్పిటల్​లో 18 వారాలు, రెండు వారాలు నిండిన ఇద్దరి గర్భిణులకు అబార్షన్ చేసేందుకు సిద్ధమవుతుండగా పక్కా సమాచారంతో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ యువరాజ్, డీఎంహెచ్​వో బీ.మాలతి, ట్రైనీ ఐపీఎస్ మౌనిక రెడ్ హ్యాండెడ్ గా హాస్పిటల్ నిర్వాహకులను పట్టుకున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఆ ఇద్దరి మహిళలకు అబార్షన్ చేసేందుకు ఇంజక్షన్ చేసి రెడీగా ఉంచినట్లు మాలతి తెలిపారు.

హాస్పిటల్ నిర్వాహకుల వద్ద నెలలు నిండని 50 మంది మహిళల కేసు షీట్లు లభించాయని చెప్పారు. అబార్షన్ చేయించుకోవడానికి వచ్చిన వారి వివరాలను ఐపీ, ఓపీలో నమోదు చేయలేదన్నారు. ప్రతి కేసు షీట్ కు కోడ్ లు వేసి ఉన్నాయని, వాటి గురించి అడిగితే హాస్పిటల్​ నిర్వాహకులు సమాధానం చెప్పడం లేదని తెలిపారు. అబార్షన్​కు వచ్చిన మహిళలు కోదాడ, కరీంనగర్, మహబూబాద్,  హైదరాబాద్ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించినట్లు చెప్పారు.

స్కానింగ్ మిషన్ ను, రికార్డ్స్, కంప్యూటర్లను, హాస్పిటల్ ను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అబార్షన్ కు సిద్ధం చేసిన ఇద్దరి మహిళలను జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ డీఎం హెచ్ వో సైదులు, వన్ టౌన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు.