గొత్తికోయల గ్రామాలపై వైద్యారోగ్య శాఖ ఫోకస్

గొత్తికోయల గ్రామాలపై వైద్యారోగ్య శాఖ ఫోకస్
  • 105 గ్రామాల్లో 23 వేల మందికి టెస్టులు
  • జనవరిలో 18 మందికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తింపు

భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని గొత్తికోయల గ్రామాల్లో ఈ నెల 9 నుంచి మలేరియా సర్వే చేపట్టాలని వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 105 గ్రామాల్లో 23 వేల మందికి టెస్టులు చేయనున్నారు. మారుమూల అటవీ గిరిజన గ్రామాల్లో జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా మలేరియా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక టీమ్​లను ఈ గ్రామాలకు పంపిస్తారు. ఇటీవల మలేరియా కేసులు నమోదు కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివాసీ గ్రామాలపై వైద్యారోగ్యశాఖ నజర్​ పెట్టింది. 

గత ఏడాది256 పాజిటివ్​ కేసులు..

జిల్లాలో మలేరియా శాఖ నివేదికల ప్రకారం 2022 జనవరి నుంచి డిసెంబరు వరకు 3,28,378 మంది జ్వరపీడితులకు టెస్టులు నిర్వహించగా 256 మలేరియా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. చికెన్​గున్యా, డెంగ్యూ తదితర జ్వరాలు ఉన్నప్పటికీ దేశంలో మలేరియా పీడిత ప్రాంతంగా భద్రాచలం మన్యం రికార్డులకెక్కింది. మైదాన ప్రాంతాల్లో మాత్రమే వైద్యసేవలు అందుతుండంతో ఇకపై కొండలు, గుట్టలు, మారుమూల గ్రామాల్లోకి కూడా వెళ్లి టెస్టులు చేసేందుకు యాక్షన్​ ప్లాన్​ రూపొందించారు. వాగులు, వంకలు, ఎత్తైన కొండలే కాకుండా దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిపుత్రులకు టెస్టులు చేస్తారు. ఈ ఏడాది జనవరి 18 వరకు 5,970 మందికి టెస్టులు చేస్తే అందులో 18 మందికి పాజిటివ్​ వచ్చింది. మలేరియా కేసులు క్రమంగా పెరుగుతుండగా, ముందుగానే నియంత్రించేందుకు జిల్లా మలేరియా శాఖ చర్యలు చేపట్టింది. ప్రతీ పీహెచ్​సీ నుంచి ఏఎన్ఎం, ఆశా కార్యకర్త, సబ్​ యూనిట్​ ఆఫీసర్, మలేరియా టెక్నికల్​ సూపర్​వైజర్లతో కూడిన బృందం తమ పరిధిలోని గ్రామాల్లో సర్వే చేయనుంది. జ్వర లక్షణాలతో బాధ పడుతున్న వారికి టెస్టులు చేసి అక్కడికక్కడే వైద్యం అందిస్తారు. 

మలేరియా అదుపులోనే ఉంది..

జిల్లాలో మలేరియా అదుపులోనే ఉంది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికీ టెస్టులు చేస్తున్నాం. మలేరియా ప్రబలకుండా దోమల నివారణకు స్ప్రేయింగ్​ చేపట్టాం. అన్ని ప్రాంతాలను కవర్​ చేయాలనే లక్ష్యంతో ఇప్పుడు ప్రతి మారుమూల గ్రామానికి టీమ్​లను పంపుతున్నాం. ఈ నెల 9 నుంచి ఫీల్డ్ లెవల్​లో టెస్టులు చేస్తారు. గొత్తికోయల గ్రామాలను ప్రధానంగా ఎంచుకున్నాం. 23 వేల మందికి టెస్టులు చేసి మలేరియా కారకాలను గుర్తిస్తాం.

- గొంది వెంకటేశ్వర్లు, 
అసిస్టెంట్​ మలేరియా ఆఫీసర్