రూల్స్ పాటించకపోతే ప్రైవేట్‌‌ ఆస్పత్రుల లైసెన్స్‌‌లు రద్దు: దామోదర రాజనర్సింహ హెచ్చరిక

రూల్స్ పాటించకపోతే ప్రైవేట్‌‌ ఆస్పత్రుల లైసెన్స్‌‌లు రద్దు:  దామోదర రాజనర్సింహ హెచ్చరిక

హైదరాబాద్‌‌, వెలుగు: క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌మెంట్ యాక్ట్ రూల్స్‌‌ పాటించకపోతే కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్ల లైసెన్స్‌‌లు రద్దు చేస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. అది ఏ స్థాయి హాస్పిటల్ అయినా ఊపేక్షించేది లేదన్నారు. ప్రజల కంటే తమ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌‌లో ఆయన అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌వోలతో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘డీఎంహెచ్‌‌వోలు జవాబుదారీ తనంతో పనిచేయాలి. నిర్లక్ష్యం పనికిరాదు. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేయాలి. తప్పు చేసినోళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. ఎవ్వరినీ వదిలిపెట్టొద్దు. కార్పొరేట్, ప్రైవేట్ దవాఖాన్లపై నిరంతరం మానిటరింగ్ అవసరం. ప్రజలను పీడిస్తే ఊరుకోవద్దు”అని మంత్రి ఆదేశించారు. 

30 కిలోమీటర్లకో హెల్త్ సెంటర్..

జిల్లా, ఏరియా, పీహెచ్‌‌సీల మధ్య భౌగోళిక కనెక్టివిటీపై దృష్టి సారించాలని మంత్రి రాజనర్సింహ సూచించారు. ప్రతి 30 కిలోమీటర్ల దూరంలో ఓ ప్రభుత్వ హెల్త్ సెంటర్ ఉండాలని, ఇందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ డాక్టర్ల అటెండెన్స్‌‌ను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని చెప్పారు. జిల్లాల వారీగా క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌మెంట్ యాక్ట్ అమలు చేయాలని పేర్కొన్నారు.

 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని, మౌలిక సదుపాయాలు, మ్యాన్ పవర్‌‌‌‌కు కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శానిటేషన్ వ్యవస్థ మెరుగుపడేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఏజెన్సీ ఏరియాల్లో అలర్ట్‌‌గా ఉండాలని మంత్రి సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. 

రోగులకు మెరుగైన డైట్‌‌ అందించాలన్నారు. డాక్టర్లు విధిగా సమయపాలన, మెరుగైన వైద్య సేవలు అందించేలా డీఎంహెచ్‌‌వోలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో చాలా మంది డీఎంహెచ్‌‌వోల పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటివి పునరావృతమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ, కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.