
- బాధితులకు అండగా 8 ఫార్మా కంపెనీలు: మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్షయ నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ అన్నారు. ఇందులో భాగంగా అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో 100 రోజులపాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ తొమ్మిది జిల్లాల్లోని క్షయ బాధితులకు ఆరాజన్ ఫౌండేషన్, ఆప్టిమస్ డ్రగ్స్, బయోలాజికల్ - ఈ, గ్లాండ్ ఫార్మా, మెట్రో కెమ్, నాట్కో ఫార్మా, గ్రాన్యూల్స్, సన్ ఫార్మాసిటికల్ ఫార్మా కంపెనీలు రూ.2.80 కోట్ల విలువైన ఫుడ్ బాస్కెట్ (కిట్స్)ను అందిస్తున్నాయని తెలిపారు. ప్రతి నెల న్యూట్రిషన్ కిట్స్ ను కూడా అందిస్తున్నాయన్నారు.
గురువారం మంత్రి దామోదర హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయా కంపెనీల ప్రతినిధులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఫార్మా కంపెనీలు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా అవగాహన, యాక్టివ్ నెస్ ఫైండింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. క్షయ వ్యాధి విస్తరించకుండా నిరంతరం స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని.. బాధితులకు చికిత్స కాలంలో 8 ఫార్మా కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధులతో న్యూట్రిషన్ కిట్స్ ను ఉచితంగా అందిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వం కూడా ఉచితంగా చికిత్స, మందులు, ప్రతి నెల వెయ్యి రూపాయల నగదును అందిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వి కర్ణన్, డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ కమల్ హాసన్ రెడ్డి, టీబీ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ డా. రాజేశం, డ్రగ్స్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ రామ్ దాన్, డాక్టర్ శ్రీగణ, డా. మహేశ్ తదితరులు పాల్గొన్నారు.