మంచిర్యాల జిల్లాలో సీ సెక్షన్లపై హెల్త్ సెక్రటరీ సీరియస్

మంచిర్యాల జిల్లాలో సీ సెక్షన్లపై హెల్త్ సెక్రటరీ సీరియస్
  • జిల్లాలో రెండు టీమ్స్​తో ఆడిటింగ్
  • త్వరలో గైనకాలజిస్టులతో మీటింగ్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రైవేట్ హాస్పిటళ్లలో విచ్చలవిడిగా సీ సెక్షన్లు చేయడాన్ని వైద్య ఆరోగ్యశాఖ సెక్రటరీ క్రిస్టినా జడ్ చాంగ్దూ సీరియస్​గా పరిగణించారు. జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్​లో 87 శాతం సీ సెక్షన్లు చేయడంపై ఈనెల 21న ‘వెలుగు’ పేపర్​లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన హెల్త్ సెక్రటరీ సీ సెక్షన్లపై ఆడిటింగ్ చేసి రిపోర్ట్ సమర్పించాలని డీఎంహెచ్ వో డాక్టర్ ఎస్.అనితకు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ మేరకు ప్రోగ్రాం డాక్టర్లు అప్పాల ప్రసాద్, అరుణశ్రీ ఆధ్వర్యంలో రెండు టీమ్స్ ను ఏర్పాటు చేసి ఆడిటింగ్ చేపడుతున్నారు. శనివారం మంచిర్యాలలోని శ్రీలత మెటర్నిటీ నర్సింగ్ హోమ్​లో తనిఖీలు చేశారు. ఈ హాస్పిటల్​లో అక్టోబర్​లో 40 డెలివరీలు జరిగితే అందులో 38 సీ సెక్షన్లు కాగా, రెండు మాత్రమే నార్మల్ డెలివరీలు చేశారు. ఇంత భారీ సంఖ్యలో సీ సెక్షనలు ఎందుకు చేయాల్సి వచ్చిందని అధికారులు ఆరా తీశారు.  

రికార్డులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, వాటి ధరలను డిస్ ప్లే చేయాలని ఆదేశించారు. డాక్టర్ శివప్రసాద్, మాస్ మీడియా అధికారి బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాగా, వైద్య ఆరోగ్యశాఖ సెక్రటరీ ఆదేశాల ప్రకారం జిల్లాలో సీ సెక్షన్లు ఎక్కువగా నమోదైన ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆడిటింగ్ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ వో అనిత తెలిపారు. త్వరలోనే కలెక్టర్ కుమార్ దీపక్ నేతృత్వంలో ప్రైవేట్ హాస్పిటల్స్ గైనకాలజిస్టులతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.