వ్యాక్సిన్ కోసం కొండలు, గుట్టలెక్కుతోన్న హెల్త్ వర్కర్లు

వ్యాక్సిన్ కోసం కొండలు, గుట్టలెక్కుతోన్న హెల్త్ వర్కర్లు

పోలియో చుక్కల నుంచి ఇప్పుడు  కరోనా వ్యాక్సిన్ దాకా హెల్త్​వర్కర్ల బాధ్యత చాలా పెద్దది. వాళ్లకు అప్పగించిన పనిని ఏమాత్రం కష్టం అనుకోకుండా చేస్తుంటారు. రోడ్డు సౌకర్యం లేని పల్లెలకు కాలినడకన పోతారు. అడవిలో, కొండ ప్రాంతంలో ఉండే గిరిజన గూడాలకి వాగులు, వంకలూ దాటి మరీ వెళతారు. అలా వెళ్లడం ప్రమాదమని తెలిసినా కూడా ప్రాణాలకు తెగిస్తారు. ఎందుకంటే అందరికీ వ్యాక్సిన్​ వేసినంకనే  వీళ్ల మనసు నిమ్మలం అయితది.కరోనా వ్యాక్సిన్ డబ్బాల్ని భుజాన వేసుకొని  కొండలు, రాళ్లురప్పలు దాటుకుంట పోతున్నరు ఉత్తరాఖండ్​కి చెందిన హెల్త్​వర్కర్లు. ఆ రాష్ట్రంలో ఉన్న దాదాపు పదిహేను గ్రామాలకి ఇండియా–చైనా సరిహద్దు ఉంది. హిమాలయ పర్వతాలకి దగ్గర్లో ఉండే ఈ ఊళ్లన్నీ 2,800 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఆగస్టు పదిహేను కల్లా ఇక్కడి ప్రజలందరికీ వ్యాక్సిన్​ వేసే బాధ్యతని హిమాలయాల్లో ఉన్న​ హెల్త్​ వర్కర్లకి అప్పగించారు. దాంతో, గత కొన్ని రోజులుగా వీళ్లు నానా ఇబ్బందులు పడుతూ డ్యూటీ చేస్తున్నారు. రోడ్డు మార్గంలో వెళ్దామనుకుంటే వరదల వల్ల, కొండచరియలు విరిగిపడి దారికి అడ్డంగా పెద్ద పెద్ద రాళ్లు పడ్డాయి. దారి మూసుకుపోయిందని వెనకడుగు వేయలేదు వాళ్లు. ‘ఎట్లయినా వెళ్లాల్సిందే’ అనుకున్నారు. అందుకు పర్వత మార్గంలో వెళ్లడం బెటర్​ అనిపించింది ఈ హెల్త్​వర్కర్లకి. ఒక్కోరోజు దాదాపు18 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ వ్యాక్సిన్​ వేసేవాళ్లు. వ్యాక్సిన్​ బాక్స్​లతో కొండ దారిలో వెళుతున్న హెల్త్​వర్కర్ల  ఫొటోలు నెట్​లో బాగా వైరల్​ అవుతున్నాయి. వీళ్ల గట్టి సంకల్పాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.