నలుగురిలో ఒకరికి కరోనా.. 

నలుగురిలో ఒకరికి కరోనా.. 
  •     తగిన సిబ్బంది లేక, ఉన్నోళ్లలో చాలా మందికి కరోనా రావడంతో పెరిగిన పని భారం 
  •     పాజిటివ్ వచ్చినా డ్యూటీలు చేయాల్సిన దుస్థితి 
  •     2 వేల మంది డాక్టర్లు, 1500 మంది నర్సులు, 5 వేల మంది ఏఎన్ఎంలు, ఆశాలకు కరోనా 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో డాక్టర్లు, హెల్త్ స్టాఫ్​పై పని భారం పడుతోంది. తగినంత మంది సిబ్బంది లేకపోవడం, కొంతమందికి కరోనా సోకడంతో డ్యూటీలో ఉన్నోళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ, తప్పని పరిస్థితుల్లో డ్యూటీలు చేయాల్సి వస్తోంది. కరోనా సోకి హోం ఐసోలేషన్​లో ఉన్నోళ్లు తిరిగి వచ్చేదాకా డ్యూటీలో ఉండాల్సి వస్తోంది. జ్వరం లాంటి మైల్డ్​ సింప్టమ్స్ ఉంటే మందులు వాడుతూనే డ్యూటీకి వస్తున్నామని, నీరసం తో సరిగ్గా పనిచేయలేకపోతున్నామని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వల్ల పేషెంట్లకు కరోనా సోకుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లతో పాటు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. 

రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందని, సిబ్బంది కొరత ఉన్నప్పటికీ రిక్రూట్ చేయడం లేదని వాళ్లు మండిపడుతున్నారు. ఉస్మానియాలో 150.. గాంధీలో 87 కేసులు 
రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ విభాగాల్లో మొత్తం 9,500 మంది డాక్టర్లు పని చేస్తుండగా.. వారిలో 1,500 నుంచి 2 వేల మంది కరోనా బారినపడి సెలవుల్లో ఉన్నారు. 6 వేల మంది స్టాఫ్​నర్సుల్లో 1,500 మంది కరోనాతో ఐసోలేషన్​లో ఉన్నారు. 37 వేల మంది ఆశావర్కర్లు, ఏఎన్​ఎంలలో 5 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. 1,550 మంది ల్యాబ్​ టెక్నీషియన్లలో 350 మందికి వైరస్ సోకింది. అధికారిక లెక్కల ప్రకారం ఉస్మానియాలో 150, గాంధీ హాస్పిటల్​లో 87 మంది కరోనా బారినపడ్డారు. 50 మంది పీజీ లు, 38 మంది హౌస్ సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్, 12 మంది ఫ్యాకల్టీ హోం క్వారంటైన్ లో ఉన్నారని గాంధీ మెడికల్ కాలేజీ స్టూడెంట్లు చెప్పారు. కాగా, ప్రైవేటు హాస్పిటళ్లలోనూ వందలాది మంది డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ కరోనా బారిన పడ్డారు. 

కొన్నిచోట్ల ఓపీలు క్యాన్సిల్... 
డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ కరోనా బారిన పడడంతో ఆస్పత్రుల్లో సేవలపై ప్రభావం పడుతోంది. గాంధీ ఆస్పత్రిలో ఇన్ పేషంట్ల (ఐపీ) సంఖ్య బాగా తగ్గించారు. ఎమర్జెన్సీ కేసులు మాత్రమే టేకప్​చేస్తున్నారు. సాధారణ రోజుల్లో 1,200 వరకు ఉండే ఐపీ సంఖ్య, ఇపుడు 400కు పడిపోయింది. ఇక ఔట్ పేషెంట్స్ (ఓపీ) సంఖ్య 1,500 నుంచి 500కు పడిపోయింది. ఉస్మానియాలో ఓపీ 1,500 వరకున్నా, చూసే డాక్టర్ల సంఖ్య తగ్గింది. అక్కడ ఇప్పుడు 150 మంది డాక్టర్లు మాత్రమే చూస్తున్నారు. ఇక కింగ్​కోఠి లో గైనిక్​ఓపీని పూర్తిగా రద్దు చేశారు. ఈ హాస్పిటల్​లో 10 మంది డాక్టర్లు కరోనా బారినపడ్డారు. నిమ్స్ ఓపీ 2 వేల నుంచి 1500కు తగ్గింది. ఏరియా హాస్పిటళ్లలోనూ డాక్టర్లు లేకుండా పోయారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో 9 మంది డాక్టర్లు ఉండగా, జీతాలు సరిగా ఇస్తలేరని సగం మంది రిజైన్ చేశారు. ఉన్నోళ్లలో ముగ్గురికి కరోనా సోకింది. 

నలుగురిలో ఒకరికి కరోనా.. 
ప్రతి నలుగురు జూనియర్ డాక్టర్లలో ఒకరు కరోనా బారిన పడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటే అందరికీ సోకే అవకాశం ఉంది. నాన్ అకడమిక్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్లను రిక్రూట్ చేయాలని మేం ముందే చెప్పినా పట్టించుకోలేదు. 
- డాక్టర్ రాహుల్, జూడా ప్రెసిడెంట్, ఉస్మానియా 

కొత్త బ్యాచ్ రాక తిప్పలు.. 
ఏటా 170 చొప్పున పీజీ స్టూడెంట్స్​బ్యాచ్​ఉంటుంది. కానీ ఈసారి పీజీ కౌన్సెలింగ్​లో ఆలస్యం జరగడంతో, ఇప్పటి వరకు కొత్త బ్యాచ్ రాలేదు. మరోవైపు 50 మంది పీజీలకు కరోనా సోకింది. దీంతో చాలా ఇబ్బంది అవుతోంది. 
- గౌరి ప్రియాంక, గాంధీ పీజీ​​ స్టూడెంట్ 

రిక్రూట్ మెంట్ చేస్తలే.. 
కరోనా టైమ్ లో టెస్టులు చేసేందుకు ఎంతో కీలకమైన ల్యాబ్ టెక్నీషియన్లను కూడా ప్రభుత్వం రిక్రూట్ చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 మందే ఉండగా, వారిలో 300 మంది కరోనా బారిన పడ్డారు. ఒకరు డ్యూటీలో చేరితే, మరొకరు ఐసోలేషన్ కు పోతున్నారు.  
- రవీందర్, స్టేట్ ప్రెసిడెంట్, ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్