కాళ్ల కింద వరద.. భుజాలపైన బిడ్డ..! కామారెడ్డి టౌన్లో హృదయ విదారక ఘటన

కాళ్ల కింద వరద.. భుజాలపైన బిడ్డ..! కామారెడ్డి టౌన్లో హృదయ విదారక ఘటన
  • ఒక్కసారిగా ఇంట్లోకి భారీగా చేరిన నీరు  
  • బిడ్డను సెల్ఫ్ పైకి ఎక్కించి.. గంటల కొద్దీ నీళ్లలోనే నిల్చుని.. ఓ తండ్రి పడిన నరకయాతన 
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన

కామారెడ్డి, వెలుగు: ఒక్కసారిగా ఇంట్లోకి వరద నీరు చేరడంతో  బయటకు, డాబాపైకి వెళ్లలేని పరిస్థితి. దివ్యాంగురాలైన బిడ్డను కాపాడుకునేందుకు భుజాలపైన మోస్తూ..11 గంటల పాటు తండ్రి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ దయనీయ స్థితిలో గడిపారు.  వివరాల్లోకి వెళ్తే.. అతి భారీ వర్షాల కారణంగా బుధవారం కామారెడ్డి పెద్ద చెరువులోకి వరద వచ్చి చేరుతుండడంతో వాగు ఉప్పొంగింది. దీంతో వరదంతా సమీపంలోని జీఆర్​కాలనీని చుట్టుముట్టింది. ఇండ్లలోకి చేరిన వరదతో కాలనీవాసులు భయంతో డాబాలపైకి ఎక్కారు. అదే కాలనీకి చెందిన లింగం కుటుంబం మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది.  అతని కూతురు దివ్యాంగురాలైన రమ్యశ్రీ వీల్​ చైర్ లో ఉండగా క్షణాల్లో వరద చుట్టూ చేరింది.

దీంతో బిడ్డను డాబాపైకి తీసుకెళ్లే పరిస్థితి లేక కాపాడుకునేందుకు లింగం, లలిత దంపతులు ఇంట్లోనే ఉండిపోయారు. ముందుగా కూతురిని సెల్ఫ్​పైన కూర్చోబెట్టాడు. వరద ఉధృతి మరింత ఎక్కువైంది. అతని భార్య కూడా సెల్ఫ్​ అంచున నిలబడింది.  బిడ్డ కింద పడకుండా రెండు కాళ్లను లింగం భుజాలపై మోస్తూ నిలబడ్డాడు. భార్యా బిడ్డలు  ఏడుస్తుంటే దు:ఖం దిగమింగుతూ ధైర్యం చెబుతూనే వరద నీటిలో11 గంటల పాటు నిల్చున్నాడు. అధికారులు, పోలీసులు మెయిన్​రోడ్డు వరకు వెళ్లినా.. కాలనీ లోపలికి వెళ్లలేని పరిస్థితి. లింగంకు స్థానిక ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అదేరోజు అర్ధరాత్రి 11 గంటల సమయంలో  రెస్య్కూ టీమ్​ వెళ్లి ముందుగా  రమ్యశ్రీని క్షేమంగా తీసుకొచ్చింది. ఆ తర్వాత లలిత, లింగంను కాపాడారు. అనంతరం ముగ్గురిని షెల్టర్ కు తరలించారు. శనివారం దంపతులు ఇంటికి వెళ్లి బురదనంతా క్లీన్ చేశారు.  

బిడ్డను కాపాడుకోవాలని..ఇద్దరు దివ్యాంగురాలైన పిల్లలు ఉండే. ఏడాది కింద కొడుకు చనిపోయాడు. కూతురిని చూసుకుంటూనే బతుకెళ్లదీస్తున్నాం. బుధవారం ఒక్కసారిగా ఇంట్లోకి వరద చేరింది. చుట్టు పక్కల ఇండ్లవాళ్లు  రమ్మని పిలిచారు. నడవలేని బిడ్డను తీసుకొని వెళ్లలేని పరిస్థితి.  బిడ్డను సెల్ఫ్ పై కూర్చొబెట్టి భుజాలపైనే మోస్తూ నిలబడ్డా. మాకు బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడం కంటే ఇంకేముంటది.


లింగం, లలిత దంపతులు