సుర్రుమంటున్న సూర్యుడు..ప్రాణాలు తీస్తున్న ఎండ .. వడదెబ్బకు బలవుతున్న రైతులు, కూలీలు

సుర్రుమంటున్న సూర్యుడు..ప్రాణాలు తీస్తున్న ఎండ  .. వడదెబ్బకు బలవుతున్న రైతులు, కూలీలు
  •     రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 23 మందికిపైగా మృతి
  •     అనధికారికంగా ఇంతకు రెండింతలు ఉండే చాన్స్​
  •     మృతులకు రూ. 4 లక్షల పరిహారం

హైదరాబాద్/ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. రైతులు, కార్మికులు, కూలీలను బలిగొంటున్నాయి. కొన్నిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పనులకు వెళ్లిన వారు తిరిగి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.

వీరిలో కొందరు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. కొంతమంది చికిత్స పొందుతూ కన్నుమూస్తున్నారు. ఈ సీజన్‌‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 23 మందికి పైగా వడదెబ్బతో మృతిచెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్‌‌ జిల్లాలోనే ఏకంగా 10 మంది వరకు చనిపోయినట్లు సమాచారం. 

వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిస్తున్నా.. 

ఎండలతో జాగ్రత్తగా ఉండాలని  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా  రైతులు, కూలీలు పంటనూర్పిళ్ల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పొలం, కూలిపనులకు వెళ్లి మృత్యువాతపడుతున్నారు. ఎండలకు వెళ్లినప్పుడు తలపై రుమాలు, టోపీలాంటివి పెట్టుకోవాలని, నీడలో ఉండాలని, తరుచూ నీరు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ డీహైడ్రేషన్‌‌కు గురైతే కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయని, వెంటనే  వైద్యుల వద్దకు వెళ్లాలని, అదే తగ్గిపోతుందని ఇంట్లోనే ఉంటే పరిస్థితి చేజారుతుందని హెచ్చరిస్తున్నారు. 

వడదెబ్బతో చనిపోతే రూ.4 లక్షల పరిహారం

ఈ సీజన్‌‌లో వడదెబ్బతో 23 మందికి పైగా చనిపోయారు. ఇవి బయటకు వచ్చిన వారి వివరాలు మాత్రమే. బయటకు రాని కేసులు ఇంతకు రెండింతలు ఉండే అవకాశముందని భావిస్తున్నారు. వడదెబ్బతో చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 4 లక్షల పరిహారం అందిస్తోంది. మృతుడికి సంబంధించిన డాక్యుమెంట్స్‌‌తో తహసీల్దార్‌‌కు దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ అధికారులు విచారించి వడదెబ్బతో మృతి చెందినట్టు తేలితే ఆర్థికసాయం అందజేస్తారు. 

వడదెబ్బతో ఇప్పటివరకు చనిపోయినవారి వివరాలు

ఆదిలాబాద్​జిల్లా నార్నూర్ హైదరాబాద్/ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. రైతులు, కార్మికులు, కూలీలను బలిగొంటున్నాయి. కొన్నిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

  •      ఆదిలాబాద్​జిల్లా తాడిహత్నూర్‌‌కు చెందిన వ్యవసాయ కూలీ విజయ్ (38) 
  •     ఆసిఫాబాద్‌‌ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్‌‌ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ ఆత్రం అక్బర్‌‌షా(33) 
  •     మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బారెపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కొట్రంగి జయరాం (40)  
  •      ఆదిలాబాద్‌‌లోని తాటిగూడ కాలనీకి చెందిన రాంగోపాల్ (65)
  •     మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బోగారపు మారయ్య ( 56)  
  •     కాగజ్‌‌నగర్‌‌ మండలం చింతగూడ గ్రామానికి చెందిన కూలీ మేకర్తి పెంటయ్య (54)  
  •     ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జశ్వంత్(16)  
  •     మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌‌ చెందిన  శ్రీనివాస్ (46) 
  •     నార్నూర్‌‌కు చెందిన  రోహిదాస్ (43) అనే రైతు  
  •     వరంగల్​ జిల్లా నెక్కొండ మండలంలోని దీక్షకుంటకు చెందిన వర్రె మల్లయ్య(55)  
  •     మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకుట్లపల్లికి చెందిన రుక్కమ్మ 
  •     వనపర్తికి చెందిన పదోతరగతి స్టూడెంట్‌‌ భరత్​ 
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన మాదినేని ఆరోగ్య బాబు  
  •     పాల్వంచ మండలం కరకవాగుకు చెందిన యలమంచలి చంద్రశేఖర్ (29) అనే ఎలక్ట్రిషియన్‌‌
  •     భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మడలం గానుగపాడులో పనితి వెంకటేశ్వర్లు (58) 
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పినపాక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన మునిగాల వెంకటేశ్వర్లు (55) అనే బర్ల కాపరి
  •     నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన తోట పెద్ద గంగాధర్ (58)  
  •      బోధన్ మండలం ఎరాజ్ పల్లిలో ఎప్రిల్​ 28న ఉపాధికూలి ఎరుకల నర్సయ్య (55) 
  •     హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ కు చెందిన బరిగెల శోభ(50)  
  •     హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రి పల్లిగూడెం గ్రామానికి చెందిన సాదుల నరహరి(58)


వడదెబ్బతో భూపాలపల్లి జిల్లాలోముగ్గురు మృతి

మొగుళ్లపల్లి, వెలుగు : వడదెబ్బతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో జరిగింది. పోతుగల్లు గ్రామానికి చెందిన మునిగాల చందర్ (40) రోజు మాదిరిగానే గురువారం ఉదయం కూలీపనికి వెళ్లాడు. తర్వాత టేకుమట్ల మండలం దుబ్యాలలో బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరై ఇంటికి వచ్చాడు. గురువారం అర్ధరాత్రి వడదెబ్బ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. 

కొండగట్టులో యాచకుడు..

కొండగట్టు, వెలుగు : వడదెబ్బకు తోడు ఆకలిబాధతో ఓ యాచకుడు చనిపోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగింది. కొండగట్టుపైన ఉన్న పార్కింగ్‌‌ స్థలం వద్ద కొత్తగా నిర్మించిన రేకుల షెడ్డులో శుక్రవారం ఓ యాచకుడు చనిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

జమ్మికుంటలో...

జమ్మికుంట, వెలుగు : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఆబాది జమ్మికుంటకు చెందిన బొగ్గుల సమ్మయ్య (60) వడదెబ్బతో చనిపోయాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సమ్మయ్య శుక్రవారం పొలం దగ్గరికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకొని ఇంటికి వచ్చాక సమ్మయ్య అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానికులు హాస్పిటల్‌‌కు తరలిస్తుండగా చనిపోయాడు.