నేటి (MAY 13) నుంచి మండే ఎండలు! 22 వరకు తీవ్ర స్థాయిలో టెంపరేచర్లు

నేటి (MAY 13) నుంచి మండే ఎండలు! 22 వరకు తీవ్ర స్థాయిలో టెంపరేచర్లు
  • 47 నుంచి 48 డిగ్రీల వరకు నమోదయ్యే చాన్స్
  • 3 డిగ్రీల దాకా టెంపరేచర్లు పెరగొచ్చన్న ఐఎండీ
  • నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా వెదర్


హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంపై సూరీడు మరోసారి నిప్పులు కక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్​ చివరి వారం వరకు తీవ్రంగా నమోదైన ఎండలు.. మే తొలివారం కొంత ఉపశమనమిచ్చాయి. కానీ బుధవారం నుంచి సీన్​ మారబోతోంది. ఎండలు మళ్లీ పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రత మరో 3 డిగ్రీలదాకా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఎండల తాకిడి ఎక్కువగా ఉంటుందని వెదర్​ ఎక్స్​పర్ట్స్​ కూడా హెచ్చరిస్తున్నారు. 19వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల మార్క్​ను చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. 

20 నుంచి 22వ తేదీ వరకు 48 డిగ్రీల మార్క్​ను దాటే అవకాశాలూ ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలూ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. నిన్నమొన్నటివరకు 42 డిగ్రీల దాకా టెంపరేచర్లు నమోదయ్యాయి. సగానికిపైగా జిల్లాల్లో అయితే 40 డిగ్రీలలోపే రికార్డ్​ అయ్యాయి. మంగళవారం ఉష్ణోగ్రతలు మళ్లీ 44 డిగ్రీల మార్క్​ను దాటేశాయి. నాలుగు జిల్లాల్లో టెంపరేచర్లు 44 డిగ్రీలను దాటాయి. అత్యధికంగా నిజామాబాద్​ జిల్లా గోపనపల్లిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

జగిత్యాల జిల్లా కోల్వాయిలో 44.4, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44.2, సిద్దిపేట జిల్లా సముద్రాలలో 44 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. మరో నాలుగు జిల్లాల్లో 43 డిగ్రీలు, 12 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పది జిల్లాల్లో 41 డిగ్రీలు, మూడు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. 

రుతుపవనాలకు సానుకూలం

ప్రస్తుతం బంగాళాఖాతంలో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 20 నాటికి అండమాన్​ తీరానికి నైరుతి రుతుపవనాలు చేరే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాన్ని ఆనుకుని ద్రోణి కొనసాగుతున్నదని ఐఎండీ తెలిపింది. తూర్పు నుంచి గాలులు కూడా వీస్తున్నాయని, ఉత్తరపాకిస్థాన్​లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వెస్టర్న్​ డిస్టర్బెన్స్​ ఏర్పడిందని పేర్కొంది. 

వాటి ప్రభావంతో రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, కర్ణాటకల్లోనూ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయని వెల్లడించింది. 15వ తేదీ నాటికి వాయువ్య భారతంలో వెస్టర్న్​ డిస్టర్బెన్స్​ ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. మొత్తానికి జూన్​ ప్రారంభం నాటికి తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంటరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.