
బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ సాగర్ ప్రాజెక్టు కు వరద పెరుగుతోంది. దీంతో జలకళను సంతరించుకుంటోంది. గత 24 గంటల్లో 17 వేల క్యూసెక్కుల నుంచి 34, 813 క్యూసెక్కులకు వరద పెరిగింది. పంటలకు 8,638 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండగా.. ప్రాజెక్ట్పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు కాగా( 80.50 టీఎంసీలు), ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1,079.30 అడుగులు ( 43.09 టీఎంసీలు) నీటి మట్టం ఉందని ప్రాజెక్టు ఏఈ రవి తెలిపారు.
9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
ప్రాజెక్ట్ దిగువ జలవిద్యుత్ కేంద్రంలో 9 మెగావాట్ల ఉత్పత్తి అవుతుందని జెన్ కో డీఈ శ్రీనివాస్ తెలిపారు. కాకతీయ కెనాల్ నుంచి వానాకాలం పంటల సాగు కు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలోని రెండు టర్బైన్ల ద్వారా 4.5 చొప్పున పవర్ జనరేట్ అవుతోంది. 9వేల క్యూసెక్కుల నీటి సరఫరా సామర్థ్యం కలిగిన కెనాల్ లో మూడున్నర వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.
నాలుగు టర్బైన్ల ద్వారా 36 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం 1,3 యూనిట్ ద్వారా 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. వరద కెనాల్ కు 3,000 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్ కు 800 క్యూసెక్కుల నీరు కొనసాగుతోంది. లక్ష్మీ కెనాల్ ద్వారా 150 క్యూసెక్కులు, అలీసాగర్ 360, గుత్ప 270, తాగునీటి కోసం 231 క్యూసెక్కుల చొప్పున అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.