రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో 27, 28, 29 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా దక్షిణ, సెంట్రల్ జిల్లాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ద్రోణి ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. చాలా చోట్ల భిన్న వాతావరణం కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదవుతున్నా.. రానున్న రోజుల్లో రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదవుతాయని సూచిస్తున్నారు.
