సిటీలోని పలు ప్రాంతాల్లో దంచికొడుతున్న వాన

సిటీలోని పలు ప్రాంతాల్లో దంచికొడుతున్న వాన

హైదరాబాద్: నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ దంచికొడుతోంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి పలుకాలనీలు ఇంకా తేరుకోని పరిస్థితుల్లో మళ్లీ ముసురుపట్టి జోరుగా కురుస్తోంది. మళ్లీ ఇళ్లలోకి నీళ్లెక్కడ వస్తాయోనని దాదాపు 190 కాలనీల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మొన్నటి వర్షం వల్ల నాగోల్ లోని అయ్యప్ప కాలనీ, లింగోజిగూడ లోని శ్రీ రామ్ నగర్ కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ వర్షం కురుస్తుండడంతో ఈ ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. 
వాతావరణశాఖ బులెటిన్ ప్రకారం నాచారంలో 3.4 సెంటీమీటర్లు, కాప్రాలో 3 సెంటీమీటర్లు, హయత్ నగర్ , ఎల్బీనగర్ లో 1.7 సెంటీమీటర్లు, ఉప్పల్ లో  1.6 సెంటీమీటర్లు, హబ్సిప్సిగూడ లో 1.5 సెంటీ మీటర్లు, రామచంద్రపురం, నేరేడ్మెట్ సఫీల్ గూడాలో 1.4 సెంటీమీటర్లు, అల్వాల్ లో 1.3 సెంటీమీటర్లు, ఏఎస్ రావు నగర్ లో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం, కుషాయిగూడలో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదు అయింది. ఆసిఫ్ నగర్ , నాంపల్లి, మెహదీపట్నం, బజార్ ఘాట్, విజయనగర్ కాలనీలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.